TS BJP: ఇక తాడోపేడో?

ABN , First Publish Date - 2023-09-27T03:23:43+05:30 IST

పార్టీ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి కొంతమంది బీజేపీ అసంతృప్త సీనియర్లు సిద్ధమయ్యారా..?

TS BJP: ఇక తాడోపేడో?

అధిష్ఠానంతో అటోఇటో తేల్చుకోవాల్సిందే

బీజేపీ అసంతృప్త సీనియర్ల నిర్ణయం..?

విజయశాంతి నివాసంలో మరోసారి భేటీ

వరుస సమావేశాల వెనక ఆంతర్యం ఏమిటో

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పార్టీ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి కొంతమంది బీజేపీ అసంతృప్త సీనియర్లు సిద్ధమయ్యారా..? పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు తాము చేసే ప్రతిపాదనలకు అధిష్ఠానం సానుకూలంగా స్పందించకపోతే ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తున్నారా..? అంటే.. అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండటం, మరోవైపు పార్టీకి ప్రజాదరణ పడిపోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అధిష్ఠానానికి తక్షణ కర్తవ్యాన్ని వివరించాలని పలువురు సీనియర్‌ నేతలు కొద్దిరోజుల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరితో భేటీకి అధిష్ఠానం నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సమావేశమైన సీనియర్లు మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. బీజేపీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి నివాసంలో ఈ భేటీ జరిగింది.


ఈ సమావేశానికి మాజీ ఎంపీలు వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్ఠానం వైఖరిపై చర్చించారు. బీఆర్‌ఎస్‌ పట్ల కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్ల బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని వారు అభిప్రాయపడ్డారు. ‘‘సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్యమకారులంతా బీజేపీ వైపు మొగ్గుచూపారు. అయితే, వారిని పార్టీ దూరం చేసుకుంటోంది. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదని అఽధినాయకత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది.. అయినా ఎందుకు జాప్యం జరుగుతుందో అంతుచిక్కడం లేదు’’ అని ఒకరిద్దరు నేతలు అన్నట్లు తెలిసింది. అధిష్ఠానం స్పందన కోసం రెండు, మూడు రోజులు వేచి చూడాలని, ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాశ్‌ జావడేకర్‌తో ఒకరిద్దరు సీనియర్‌ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొద్దిసేపు చర్చించారు. వారి ఆవేదనను అధినాయకత్వం దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.

భేటీల వెనుక ఆంతర్యం ఏమిటో..?

అధినాయకత్వం వైఖరి స్పష్టం కాకపోవడంతో అసంతృప్త సీనియర్లు వరుస భేటీలు నిర్వహించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రధాని మోదీ మరో వారం రోజుల్లో రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో కమలం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, వరుస సమావేశాల్లో అసంతృప్త సీనియర్లు చర్చిస్తున్న అంశాలకు అధినాయకత్వం సానుకూలంగా స్పందించే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో వారు ఇంకెన్ని రోజులు వేచిచూస్తారు..? ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.

Updated Date - 2023-09-27T10:31:34+05:30 IST