Kavitha Phones: కవిత ఫోన్లను ఓపెన్ చేసిన ఈడీ.. ఎందుకు ఫోన్ల చుట్టే కథ నడుస్తోందంటే..

ABN , First Publish Date - 2023-03-28T18:05:01+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) సంబంధించిన విచారణను..

Kavitha Phones: కవిత ఫోన్లను ఓపెన్ చేసిన ఈడీ.. ఎందుకు ఫోన్ల చుట్టే కథ నడుస్తోందంటే..

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) సంబంధించిన విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. ఎమ్మెల్సీ కవిత సమర్పించిన ఫోన్లను (MLC Kavitha Phones) ఈడీ అధికారులు మంగళవారం నాడు (28-03-2023) ఓపెన్ చేశారు. కవిత తరపున ఈడీ విచారణకు ఆమె లీగల్ అడ్వైజర్ సోమా భరత్ (Soma Bharat) హాజరు కావడం గమనార్హం. ఫోన్లను ఓపెన్ చేసేందుకు స్వయంగా హాజరు లేదా ప్రతినిధిని పంపాలంటూ కవితకు సోమవారం ఈడీ లేఖ రాసింది. ఈ నెల 21న ఈడీకి 9 ఫోన్లు ఎమ్మెల్సీ కవిత అప్పగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం జరిగిన సమయంలో.. కవిత రెండు నంబర్లతోనే పది ఫోన్లను మార్చినట్టు ఈడీ గుర్తించింది. 6209999999 నంబర్‌తో ఆరు ఫోన్లు.. 8985699999 నంబర్‌తో నాలుగు ఫోన్లు ఆమె మార్చారని గుర్తించింది. ఈ కుంభకోణంలో కవితతో సహా 36 మంది 70 ఫోన్లను మార్చారని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే.

కవిత నుంచి ఒక మొబైల్‌ ఫోన్‌ను మార్చి 11నే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరోజు ఆమెను విచారిస్తున్న సమయంలోనే.. సాయంత్రం ఆమె డ్రైవర్‌ను ఇంటికి పంపించి మరీ ఆ ఫోన్‌ను తెప్పించుకున్నారు. ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో పేర్కొన్న పది ఫోన్ల గురించి ప్రశ్నించారు. వాటిని తాను ధ్వంసం చేయలేదని, అవి కూడా తన వద్దే ఉన్నాయని కవిత చెప్పడంతో విచారణకు వచ్చేటప్పుడు వాటిని కూడా తేవాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు కవిత వాటిని కూడా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో.. కవిత వాడిన మొత్తం 11 ఫోన్లు ప్రస్తుతం ఈడీ స్వాధీనంలో ఉన్నట్లయింది.

కాగా.. విచారణలో భాగంగా.. దర్యాప్తు అధికారి జోగీందర్‌, మహిళా అధికారి భానుప్రియతో పాటు ముగ్గురు అధికారులు ఆమెపై ప్రధానంగా ఫోన్లలో జరిగిన సంభాషణలు, సందేశాలకు సంబంధించే ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది. కవితతో పాటు.. శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు ఫోన్లను మార్చడం గురించి కూడా వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మార్చిన అన్ని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి వారు ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ఆరా తీసినట్లు సమాచారం. వారు అడిగిన ప్రశ్నలకు కవిత.. తాను ఫోన్లను కావాలని మార్చలేదని, తన వంటమనిషి, పార్టీ కార్యకర్తలు, తోటి కోడలు కూడా తన ఫోన్లు వాడుతూ ఉంటారని, ఏ ఫోన్‌నూ ధ్వంసం చేయలేదని చెప్పారని.. గతంలో ఆమె పలు మీడియా చానల్స్‌కు చెప్పిన విషయాల్నే ఈడీ అధికారులకూ చెప్పారని.. విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా.. కవిత వినియోగించిన ఫోన్లను ఈడీ ఓపెన్ చేయడంతో మరోసారి కవిత ఫోన్లకు సంబంధించిన చర్చ అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో జోరుగా జరుగుతోంది.

Updated Date - 2023-03-28T18:05:06+05:30 IST