Budget: బడ్జెట్పై చార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-02-11T18:05:24+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌ (Budget) పుస్తకాలు దొడ్డుగా ఉన్నయి. అవి చూసి మాల్‌ మసాలా బాగుంటదని అనుకున్నం. కానీ మాల్‌ లేదు.. మసాలా కూడా లేదు..

Budget: బడ్జెట్పై చార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్

హైదరాబాద్: ‘‘రాష్ట్ర బడ్జెట్‌ (Budget) పుస్తకాలు దొడ్డుగా ఉన్నయి. అవి చూసి మాల్‌ మసాలా బాగుంటదని అనుకున్నం. కానీ మాల్‌ లేదు.. మసాలా కూడా లేదు’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) అన్న మాటలవి. బీఆర్ఎస్‌ (BRS) గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు (Congress leaders) విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బడ్జెట్పై కాంగ్రెస్ చార్జ్షీట్ (Charge sheet) విడుదల చేసింది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. 8 రెట్లు అప్పు చేశారని తెలిపారు. అంచనాల బడ్జెట్కు, వాస్తవ బడ్జెట్కు పొంతన లేదని కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి (Maheshwar Reddy) దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందనడానికి బడ్జెట్ ప్రత్యక్ష సాక్షమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మేడిపండు చందంగా ఉందని హస్తం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అంకెల గారడీ, మాయమాటలతో రంగుల ప్రపంచాన్ని చూపారని మండిపడ్డారు. అనేక జిల్లాల్లో విద్యుత్తు కోతలపై రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే వెలుగులు, జిలుగులంటూ గొప్పగా చెప్పుకోవడం విచారకరమని దుయ్యబడుతున్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో రూ.6,229 కోట్లు కేటాయించారని, దీన్నిబట్టే బీసీలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో స్పష్టమవుతోందని మండిపడుతున్నారు.

జీరో బడ్జెట్‌

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జీరో బడ్జెట్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తప్పుబట్టారు. కేసీఆర్‌ వచ్చాక బడ్జెట్‌ కేటాయింపులకు, ఖర్చులకు పొంతన ఉండడం లేదన్నారు. గత బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.15 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే పైసా ఖర్చు చేయలేదని చెప్పారు. అనేక పథకాలకు, అభివృద్ధి పనులకు, కేటాయింపులకు, ఖర్చులకు 30 శాతం పైగా తేడా ఉంటుందని పేర్కొన్నారు. భూప్రపంచంలో ఇంత వ్యత్యాసం ఉన్న బడ్జెట్‌ ఎవరూ ప్రవేశ పెట్టలేదన్నారు. ‘ఇచ్చేది లేదు.. చచ్చేది లేదు.. రాస్కో సాంబా..?’ అన్నట్టు రాసుకొని, అసెంబ్లీలో చదివారని ఎద్దేవా చేశారు.

భారీ పద్దు సరే.. రాబడులేవీ?

రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. ఎప్పట్లాగే, నేల విడిచి సాము చేసిందన్న అభిప్రాయాలున్నాయి. వాస్తవాల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించలేదని, గత ఏడాది తరహాలోనే కేంద్రంపై అతి నమ్మకం పెట్టుకుందని అంటున్నారు. నిజానికి, గత సంవత్సరం రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించి, రూ.2,37,611.52 కోట్లకు సవరించింది. అయినా.. ఈసారి సవరించిన బడ్జెట్‌కు 22.21శాతం (రూ.52,784.48 కోట్లు) పెంచి రూ.2.90 లక్షల కోట్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్‌లో అంచనా వేసిన గ్రాంట్లు లక్ష్యం మేర సమకూరే పరిస్థితులు లేవు. దీనికింద గత బడ్జెట్లో రూ.41,001 కోట్లు వస్తాయని సర్కారు అంచనా వేసింది. కానీ, డిసెంబరు నాటికి కేవలం రూ.7,700 కోట్లే వచ్చాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎంతో కొంత నిధులు వచ్చినా.. మొత్తంమీద, రూ.10-12వేల కోట్ల మధ్య ఉండొచ్చు. అయినా, మళ్లీ కొత్త బడ్జెట్‌లో రూ.41వేలకోట్ల గ్రాంట్లను ఆశించడం విశేషం.

Updated Date - 2023-02-11T18:05:25+05:30 IST