Share News

TS Politics: కర్ణాటక కూలీలను తెచ్చి బీఆర్ఎస్ నీచ రాజకీయం.. మీరే చూడండి..!!

ABN , First Publish Date - 2023-10-28T18:01:13+05:30 IST

వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు ప్లకార్డులతో హల్‌చల్​చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఈ ర్యాలీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని ఓ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

TS Politics: కర్ణాటక కూలీలను తెచ్చి బీఆర్ఎస్ నీచ రాజకీయం.. మీరే చూడండి..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వం హోరెత్తిపోతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే పక్క రాష్ట్రం రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు ప్లకార్డులతో హల్‌చల్​చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దనే నినాదాలు చేస్తూ కర్ణాటకకు చెందిన వ్యక్తులు కొడంగల్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

కట్ చేస్తే.. ఈ ర్యాలీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, గ్యారంటీ పథకాలను ప్రజలు నమ్ముతున్నారనే ఉద్ధేశంతో కర్ణాటకకు చెందిన పెయిడ్ ఆర్టిస్టులతో ఇక్కడ ర్యాలీలు చేయిస్తోంది. ఈ విషయాన్ని సదరు కర్ణాటక వ్యక్తులే వెల్లడించడం గమనించాల్సిన విషయం. తమకు డబ్బులు ఇచ్చారని.. అందుకే ర్యాలీ చేశామని వాళ్లు మీడియాకు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరంతా కేవలం రూ.300 కూలీ కోసం ఓ ఏజెంట్ ద్వారా రైతుల వేషంలో పరిగి వచ్చారని విచారణలో తేలింది. సదరు ఏజెంట్​ఎలా చెబితే తాము అలా చేశామని, చివరకు తమను పరిగిలోనే వదిలి వెళ్లిపోయారని సదరు వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కోట్రిక ప్రాంతం నుంచి తాము పరిగి వరకు వచ్చామని, ఒక్కొక్కరికి రూ.300 ఇస్తామంటే వాహనంలో ఎక్కుంచుకుని వచ్చారని వాళ్లు తెలిపారు. దీంతో అధికారం కోసం అధికారంలో ఉన్న పార్టీ ఇంత నీచానికి పాల్పడాలా అంటూ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏవేవో చేస్తామని చెప్పే బదులు వాటిని ఇప్పుడే అమలు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Babu Mohan: టికెట్ ఇవ్వని బీజేపీ.. త్వరలో రాజీనామా యోచనలో బాబూ మోహన్?

కాగా పరిగిలో నిరసన చేపట్టిన వారికి కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు నిరసన కారులను అడ్డుకుని ప్లకార్డులు చింపేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఎన్నికల సమయంలో స్థానికేతరులు నిరసనలు చేసేందుకు ఎలా అనుమతి ఇస్తారని పోలీసులను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

Updated Date - 2023-10-28T18:01:13+05:30 IST