Suryakumar yadav: ‘సూర్య’’.. నీకో నమస్కారం.. ఏదీ ఆ టీ20 ప్రతాపం..?

ABN , First Publish Date - 2023-03-23T17:56:45+05:30 IST

టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగే సూర్యుడు.. వన్డేలకు వచ్చేసరికి తుస్సుమనిపించాడు. ఒక మ్యాచ్ కాకపోతే మరో మ్యాచ్‌లో అయినా నిలుస్తాడనుకుంటే ఒక్క బంతికే వికెట్ ఇచ్చేసి అభిమానులను పూర్తిగా నిరాశపర్చాడు...

Suryakumar yadav: ‘సూర్య’’.. నీకో నమస్కారం.. ఏదీ ఆ టీ20 ప్రతాపం..?

భారత్ -ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ (IndiaVsAustralia ODI series) ముగిసింది. సిరీస్ మనకు దక్కలేదు. ఓ ఊహించని రికార్డు మాత్రం ఖాతాలో చేరింది. అయితే, అది ఎవరూ కోరుకోనిది. ఆ రికార్డు ఏమంటే.. వరుసగా మూడు వన్డేల్లోనూ తొలి బంతికే డకౌట్ కావడం.. ఈ ‘‘గోల్డెన్ డక్’’ల (golden duck outs) అపఖ్యాతి ఏ టెయిలెండరుదో.. లోయరార్డర్ బ్యాట్స్‌మన్‌దో కాదు.. మెరుపు వీరుడు సూర్యకుమార్ యాదవ్‌ది (Suryakumar yadav). టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగే సూర్యుడు.. వన్డేలకు వచ్చేసరికి తుస్సుమనిపించాడు. ఒక మ్యాచ్ కాకపోతే మరో మ్యాచ్‌లో అయినా నిలుస్తాడనుకుంటే ఒక్క బంతికే వికెట్ ఇచ్చేసి అభిమానులను పూర్తిగా నిరాశపర్చాడు. బహుశా.. ఏ ఫార్మాట్‌లోనూ ఏ క్రికెటర్ కూడా ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తొలి బంతికే ఔటై ఉండడు.

రాకరాక అవకాశం వస్తే..

రెండేళ్లలో 48 మ్యాచ్‌లు 46 ఇన్నింగ్స్‌లు.. 1,675 పరుగులు.. మూడు సెంచరీలు.. 13 అర్ధ సెంచరీలు.. సగటు 46.. స్ట్రయిక్ రేట్ 175. ఇవీ టి20 ఫార్మాట్‌లో సూర్య కుమార్ యాదవ్ కళ్లు చెదిరే గణాంకాలు. ఈ క్రమంలోనే అతడు పొట్టి ఫార్మాట్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. 30 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైనా.. కుర్రాళ్ల ఆట అయిన టీ20ల్లో దుమ్మురేపాడు. మరెవరికీ కలలోనైనా సాధ్యం కానంతటి భిన్నమైన షాట్లతో మిస్టర్ 360గా పేరుతెచ్చుకున్నాడు. టీ20 వైస్ కెప్టెన్‌గానూ ఎదిగాడు. కానీ, ఆ ప్రతిభంతా టీ20లకే పరిమితమైందా? అంటే.. ఇప్పటికైతే ఔననే చెప్పాలేమో? పొట్టి ఫార్మాట్‌లో సూర్య ఆడుతున్న తీరు చూసి.. అతడిని ఇంతకాలం జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని చాలామంది తప్పుబట్టారు. వన్డేలతో పాటు టెస్టుల్లోకీ తీసుకోవాలని మాజీలు, దిగ్గజాలు కొందరు డిమాండ్ చేశారు. కానీ.. ఏం లాభం? వన్డేల్లో రాకరాక సువర్ణావకాశం వస్తే చేజేతులా జారవిడిచాడు.

Untitled-9.jpg

అయ్యర్ గాయం.. సూర్యకు శాపం..

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు (AustraliaVsIndia ODI series) శ్రేయాస్ అయ్యర్ (Shreyas iyer) అందుబాటులో ఉండి ఉన్నా బాగుండేమో..? సూర్యకుమార్ ఖాతాలో చెత్త రికార్డు చేరకుండా ఉండేది. అభిమానులే కాదు సూర్య కూడా ఇలా మనసులో కోరుకుని ఉంటాడేమో..? లెక్కప్రకారం అయ్యర్ గాయం సూర్యకు వరం కావాలి. కానీ, శాపమైంది. శ్రేయస్ గనుక ఆడి ఉంటే.. సూర్యకు తుదిజట్టులో చాన్స్ లేకుండేది. కానీ, అతడు గాయపడడం సూర్యకు చాన్స్ రావడం.. అది దారుణ వైఫల్యానికి వేదిక కావడం బ్యాడ్‌లక్ అనుకోవాలి.

అసలు వన్డేలకు పనికొస్తాడా?

0, 0, 0, 14, 31, 4, 6, 34, 4, 8.. ఇవీ సూర్యకుమార్ గత పది వన్డే ఇన్నింగ్స్ స్కోర్లు. మొత్తం కలిపితే 101. తనదైన రోజు అతడు ఒక్క టీ20 మ్యాచ్ లో కొట్టే స్కోరు. కానీ, వన్డేలకు వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేస్తున్నాడు. ఇప్పటివరకు 23 వన్డేలాడిన అతడు చేసింది 433 పరుగులే. సగటు 24 కాగా.. స్ట్రయిక్ రేట్ కూడా 101 మాత్రమే. ఎప్పుడో ఏడాది కిందట అర్ధ సెంచరీ చేశాడు. మధ్యలో 17 ఇన్నింగ్స్ లు గడిచాయి.. మళ్లీ బ్యాట్ ఎత్తిందే లేదు. దీంతో అసలు 50 ఓవర్ల ఫార్మాట్ కు పనికొస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Untitled-10.jpg

అంచనాలు ముంచాయా? లోపాలు పసిగట్టారా?

టీ20ల్లో ఎంతటి అరివీర భయంకర పేసర్ నైనా చితక్కొట్టే.. 145 కిలోమీటర్ల వేగంతో నాలుగో స్టంప్, ఐదో స్టంప్ మీద బంతి వేసినా అలవోకగా బౌండరీకో, సిక్సర్ కో తరలించే పంపించే సూర్య వన్డేల్లో మాత్రం ఒక్క బంతికే తడబడుతున్నాడు. విపరీతమైన ఆదరణ ఉండే టీ20 క్రికెట్ లో వచ్చిన పేరు అతడిపై ఒత్తిడి పెంచిందా? అనే అనుమానం కలుగుతోంది. అంతేకాక సూర్యకుమార్ లోపాలను ప్రత్యర్థి బౌలర్లు కనిపెట్టారా? అనే సందేహమూ వస్తోంది. ఆసీస్ తో సిరీస్ నే తీసుకుంటే ఫుల్లర్ లెంగ్త్ బంతులకు రెండు సార్లు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఒకసారి రివ్యూ కోరినా.. మరోసారి ఆ అవరమే లేదని తేలిపోయింది. కొత్తగా క్రీజులోకి అడుగుపెట్టిన సమయంలో సూర్య.. కాస్త అసౌకర్యంగా, నాలుగో స్టంప్ లైన్ లో బలహీనంగా కనిపిస్తాడు. ఇదే అదనుగా వికెట్ టు వికెట్ బౌలింగ్ తో స్టార్క్ అతడి పనిపట్టాడు. మూడో వన్డేలోనూ ఇలానే ఆఫ్ స్టంప్ (స్పిన్నర్ ఆస్టిన్ ఆగర్) ఇచ్చేశాడు.

ఫాఫం.. ప్రాక్టీస్ చేసినా..

సూర్య ఇబ్బందిని గమనించిందో ఏమో..? టీమ్ మేనేజ్ మెంట్ అతడిని ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్ లో చాలా కిందకు ఏడో స్థానంలో దింపింది. దీనికిముందు సూర్య డగౌట్ లో తన స్టాన్స్‌ను సరిచూసుకుంటూ, కెప్టెన్ రోహిత్ శర్మతో ముచ్చటిస్తూ.. మంచి ఇన్నింగ్స్ ఆడాలన్న తపనతో కనిపించాడు. కానీ.. తక్కువ ఎత్తులో వచ్చిన షార్ట్ బాల్ సూర్య ఫ్రంట్ ఫుట్ ను ఛేదించుకుని వెళ్లి వికెట్ గిరాటేసింది. దీంతో టి20 మెరుపు వీరుడు కొన్ని సెకన్లు క్రీజులోనే కూర్చుండిపోయాడు.

Untitled-12.jpg

అవకాశాలు కష్టమే..

ఆసీస్ తో టెస్టులోనూ విఫలమైన సూర్యకుమార్ కు ఇంకా వన్డే అవకాశాలు ఇస్తారా? అంటే కాస్త కష్టమేనని చెప్పొచ్చు. అయ్యర్ అందుబాటులోకి వస్తే ఇక చాన్సే ఉండదు. వాస్తవానికి అయ్యర్ బదులుగా ఈ సిరీస్ లో మధ్యప్రదేశ్ బ్యాట్స్ మన్ రజత్ పటిదార్ ను ఆడిద్దాం అనుకున్నారు. కానీ, టి20 ఫామ్ ను చూసి సూర్య వైపు మొగ్గారు. అతడికేమో కాలం కలిసిరాలేదు. అంతమాత్రాన వన్డే జట్టులో చోటు పూర్తిగా లేదని చెప్పలేం. 32 ఏళ్ల సూర్య మరో మూడు, నాలుగేళ్లు ఆడగలడు. లోపాలను సరిచేసుకుని వస్తే రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ తర్వాత ఏర్పడే ఖాళీల్లో సర్దుబాటు కావొచ్చు.

కొసమెరుపు..: వన్డేల్లో భారత హ్యాట్రిక్ డక్ వీరులెవరో తెలుసా?

హ్యాట్రిక్ డక్ లంటూ సూర్యకుమార్ ను ఆడిపోసుకుంటున్నారు కానీ.. ఈ కోరుకోని రికార్డు దిగ్గజ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ పేరిట కూడా ఉంది తెలుసా..? సచిన్ 1994లో మూడు మ్యాచ్ ల్లోనూ పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (1996), పేసర్లు జహీర్ ఖాన్ (2003-04), ఇషాంత్ శర్మ (2010-11), జస్ప్రీత్ బుమ్రా (2017-19) వరుసగా మూడు మ్యాచ్ ల్లోనూ ఖాతా తెరవలేకపోయారు. అయితే, వీరు సూర్యలా తొలి బంతికే ఔటయ్యారా? అనేది మాత్రం సస్పెన్స్.

Updated Date - 2023-03-23T18:07:59+05:30 IST