Rohit Sharma: రవిశాస్త్రి విమర్శలపై రోహిత్ శర్మ ఘాటు స్పందన!.. ఊహించని వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-08T17:52:52+05:30 IST

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shatri) విమర్శలపై గత కొంతకాలంగా నిశబ్ధాన్ని పాటిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఊహించని రీతిలో స్పందించాడు...

Rohit Sharma: రవిశాస్త్రి విమర్శలపై రోహిత్ శర్మ ఘాటు స్పందన!.. ఊహించని వ్యాఖ్యలు

ముంబై: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shatri) విమర్శలపై గత కొంతకాలంగా నిశబ్ధాన్ని పాటిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఊహించని రీతిలో స్పందించాడు. అతివిశ్వాసం కారణంగానే ఇండోర్ టెస్టులో (Indore test) టీమిండియా ఓడిందంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించడంపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ‘పనికిమాలిన’ వ్యాఖ్యలుగా కొట్టిపారేశాడు. రవిశాస్త్రిని బయటి వ్యక్తిగా పేర్కొన్న రోహిత్.. అతడి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరంలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘‘ మేం రెండు మ్యాచ్‌లు గెలవడం బయటి వ్యక్తులకు అతివిశ్వాసంగా అనిపిస్తోంది. ఇది పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే.. నాలుగు మ్యాచ్‌ల్లోనూ రాణించాలని మేము కోరుకుంటాం కదా. రెండు విజయాలతో ఆగిపోవాలని కోరుకోం కదా. ఓవర్‌కాన్ఫిడెన్స్ అని వ్యాఖ్యానించేవారు.. ముఖ్యంగా బయటి వ్యక్తులకు డ్రెసింగ్ రూమ్‌లో మేము ఏం మాట్లాడుకుంటామో తెలియదు’’ అని రోహిత్ అన్నాడు. గురువారం నుంచి అహ్మదాబాద్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విలేకరులు అడిగిన ప్రశ్నకు రోహిత్ ఈమేరకు స్పందించాడు.

కాగా రవిశాస్త్రి 2014 నుంచి 6 ఏళ్లపాటు టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగాడు. టీమిండియా ఓటములకు కారణాలు వెతికేందుకు రవిశాస్త్రి ఉత్సాహం ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో ఓటమి అనంతరం స్టార్ స్పోర్ట్స్‌కు కామెంటరీ చెబుతూ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘చిన్న ఆత్మసంతృప్తి, కొద్దిపాటి ఆత్మవిశ్వాసం విలువను తగ్గించేస్తాయి. ఇండోర్ మ్యాచ్ టీమిండియాను కిందికి దిగజార్చుతుంది’’ అంటూ విమర్శించాడు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ గత 18 నెలలుగా నిశబ్ధాన్ని పాటిస్తున్నాడు. మీడియా సమావేశాల్లో కూడా హుందాగా మాట్లాడుతున్నాడు. కానీ తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాత్రం కాస్త ఘాటుగానే స్పందించడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-03-08T18:01:29+05:30 IST