U19 T20 World Cup: చరిత్ర లిఖించిన భారత్.. తెలుగమ్మాయి కీలక పాత్ర

ABN , First Publish Date - 2023-01-29T20:38:08+05:30 IST

భారత ఉమెన్స్ అండర్19 (Womens U19 world cup) క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌లో భారత జట్టు విశ్వవిజేతగా అవతరించింది.

U19 T20 World Cup: చరిత్ర లిఖించిన భారత్.. తెలుగమ్మాయి కీలక పాత్ర

న్యూఢిల్లీ: భారత ఉమెన్స్ అండర్19 (Womens U19 world cup) క్రికెట్ (Cricket) జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌లో (Womens U19 world cup) భారత (India) జట్టు విశ్వవిజేతగా అవతరించింది. షెఫాలి వర్మ (Shafali Verma) నేతృత్వంలోని టీమిండియా ఫైనల్ మ్యాచ్‌లో గ్రేస్ స్ర్కీవెన్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ అద్భుతంగా రాణించింది. చక్కటి బౌలింగ్‌తో 17.1 ఓవర్లలో స్వల్ప స్కోరు 68 పరుగులకే ఇంగ్లండ్‌ను (IndiaVsEngland) ఆలౌట్ చేశారు. తొలుత 6.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది. 68 పరుగులకే చాపచుట్టేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌ఉమెన్లలో అత్యధికంగా 19 పరుగులు చేసిన ర్యానా మెక్‌డొనాల్డ్-గేయ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత నియామ్ హోల్లాండ్, అలెక్సా స్టోన్‌హౌస్, సోఫియా స్మేల్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

Untitled-6.jpg

69 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ సునాయాసంగా టార్గెన్‌ను చేధించింది. ఓపెనర్లు షెఫాలి వర్మ-శ్వేతా సెహ్రావత్ మొదటి వికెట్‌కు 16 పరుగులు జోడించారు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద హన్నా బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి షెఫాలి వెనుదిరిగింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే జట్టు స్కోరు 20 పరుగుల వద్ద గ్రేస్ బౌలింగ్‌లో శ్వేతా సెహ్రావత్ క్యాచ్ ఔటయ్యింది. తొలి రెండు వికెట్లు వెంటవెంటనే కోల్పోయినప్పటికీ తెలుగమ్మాయి గొంగడి త్రిష, సౌమ్య తివారీ జోడి 46 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. చెరో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద గొంగడి త్రిష ఔటయినప్పటికీ హృషిత బసుతో కలిసి సౌమ్య తివారీ మ్యాచ్‌ను ముగించింది. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన టిటాస్ సాధుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక గ్రేస్ స్ర్కివెన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ధి సిరీస్ దక్కింది.

Untitled-5.jpg

స్కోర్ బోర్డ్..

ఇంగ్లండ్ బ్యాటింగ్: గ్రేస్ స్ర్కివెన్స్ (4), లిబర్టీ హీప్ (0), నియామ్ హోల్లాండ్ (10), సెరెన్ స్మేల్ (3), ర్యానా మెక్‌డొనాల్డ్ గేయ్ (19), చైరిస్ పావెలీ (2), అలెక్సా స్టోన్‌హౌస్ (11), జోసీ గ్రోవ్స్ (4), హన్నా బేకర్ (0), సోఫీ స్మేల్ (11), ఎల్లీ అండర్సన్ (0 నాటౌట్). భారత బౌలర్లలో టిటాస్ సాదు, అర్చనా దేవి, ప్రష్వీ చోప్రా తలో 2 వికెట్ల చొప్పున తీశారు. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు.

భారత బ్యాటింగ్: షెఫాలీ వర్మ (15), శ్వేతా సెహ్రావత్ (5), సౌమ్య తివారీ (24 నాటౌట్), గొంగడి త్రిష(24), హృషి బసు (0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మన్నా బేకర్, గ్రేస్ స్ర్కీవెన్స్, అలెక్సా స్టోన్‌హౌస్ తలో వికెట్ తీశారు.

Untitled-7.jpg

Updated Date - 2023-01-29T21:06:10+05:30 IST