Habib: ఫుట్‌బాల్‌ దిగ్గజం హబీబ్‌ ఇక లేరు

ABN , First Publish Date - 2023-08-16T03:51:15+05:30 IST

భారత దిగ్గజ ఫుట్‌బాలర్‌ మహ్మద్‌ హబీబ్‌ (74) అనారోగ్యంతో కన్నుమూశాడు.

 Habib: ఫుట్‌బాల్‌ దిగ్గజం హబీబ్‌ ఇక లేరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత దిగ్గజ ఫుట్‌బాలర్‌ మహ్మద్‌ హబీబ్‌(Footballer Mohammed Habib) (74) అనారోగ్యంతో కన్నుమూశాడు. కొన్నేళ్లుగా పార్కిన్సన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న హబీబ్‌ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. హైదరాబాద్‌కు చెందిన హబీబ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1980లో భారత ప్రభుత్వం ఆయనను అర్జున అవార్డు(Arjuna Award)తో సత్కరించింది. బ్యాంకాక్‌లో 1970లో జరిగిన ఆసియా క్రీడల్లో హైదరాబాదీ సయ్యద్‌ నయీముద్దీన్‌ కెప్టెన్సీలో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో హబీబ్‌ సభ్యుడు. కోల్‌కతాలోని మోహన్‌ బగాన్‌, ఈస్ట్‌ బెంగాల్‌, మహ్మడన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌లకు హబీబ్‌ ప్రాతినిథ్యం వహించాడు. 1960-70వ దశకంలో ఈ మిడ్‌ఫీల్డర్‌ తన ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హబీబ్‌కు భారత తొలి ‘ట్రూ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంది.

అతడికి విదేశీ ఫుట్‌బాల్‌ క్లబ్‌(Foreign football club)ల నుంచి వచ్చిన ఎన్నో ఆఫర్లను అప్పట్లో వదులుకున్నాడు. 1977లో ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే టీమ్‌ (న్యూయార్క్‌ కాస్మోస్‌)పై మోహన్‌ బగాన్‌ తరఫున హబీబ్‌ చేసిన గోల్‌ గురించి ఇప్పటికీ ఆ తరం ఫుట్‌బాలర్లు, అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పీలేతో పాటు కార్లోస్‌ ఆల్బెర్టో, జార్జియో చినాగ్లియా వంటి దిగ్గజాలు ఆడారు. మ్యాచ్‌ అనంతరం హబీబ్‌ ఆట తీరుపై పీలే ప్రశంసల వర్షం కురిపించాడు. 1969లో బెంగాల్‌ తరఫున సంతోష్‌ ట్రోఫీలో బరిలోకి దిగిన హబీబ్‌ 11 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కొద్దికాలం టాటా ఫుట్‌బాల్‌ అకాడమీలో యువ ఫుట్‌బాలర్లకు తర్ఫీదు ఇచ్చిన హబీబ్‌.. అనంతరం పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని భారత ఫుట్‌బాల్‌ అకాడమీకి చీఫ్‌ కోచ్‌గా పనిచేశాడు.

Updated Date - 2023-08-16T04:18:17+05:30 IST