Vizag One Day: రెండో వన్డేపై అభిమానుల్లో ఆందోళన!
ABN , First Publish Date - 2023-03-18T18:51:14+05:30 IST
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో ఆదివారం (మార్చి 19న)

విశాఖపట్నం: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో ఆదివారం (మార్చి 19న) జరగాల్సిన రెండో వన్డే(Vizag One Day)పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వేళ వరుణుడు వారి ఆశలపై నీళ్లు కుమ్మరించేలా ఉన్నాడు. ద్రోణి ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వాతావరణశాఖ హెచ్చరికలతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. వేలాదిమంది అభిమానులు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసి ఆదివారం నాటి మ్యాచ్‌కు సన్నద్ధమవుతుండగా వరుణుడు వారి ఆనందానికి బ్రేకులు వేసేలా ఉన్నాడు. మరోవైపు, భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. నగరంలో ఆదివారం దాదాపు మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వర్షం కనుక ఉదయం కురిసి ఆగిపోతే మైదానం ఆరిన తర్వాత మ్యాచ్ కొంత ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అదే మధ్యాహ్నం తర్వాత కురిస్తే మాత్రం ఇక కష్టమే. ఇక, ముంబైలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైజాగ్ మ్యాచ్ కనుక రద్దయితే 22న చెన్నైలో జరిగే మూడో వన్డే(Chennai One Day) కీలకంగా మారుతుంది.