Kohli-Gambhir IPL Spat: కోహ్లీ-గంభీర్ గొడవపై స్పందించిన సెహ్వాగ్

ABN , First Publish Date - 2023-05-04T15:46:20+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్

Kohli-Gambhir IPL Spat: కోహ్లీ-గంభీర్ గొడవపై స్పందించిన సెహ్వాగ్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ మ్యాచ్‌లో తొలుత విరాట్ కోహ్లీ(Virat Kohli)-నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq) మధ్య మైదానంలో గొడవ జరిగింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ, లక్నో మెంటార్ గౌతం గంభీర్ (Gautam Gambhir) కలబడ్డారు. ఈ గొడవ క్రికెట్ ప్రపంచంలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. వీరి గొడవను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ ((BCCI)) ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది.

కోహ్లీ-గంభీర్ గొడవపై తాజాగా టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) స్పందించాడు. విజేతగా నిలిచిన జట్టు సంబరాలు చేసుకోవడానికి వెళ్లిపోవాలని, ఓడిన జట్టు మౌనంగా తమ ఓటమిని అంగీకరించాలని సూచించాడు.

మ్యాచ్ అయిపోయిన వెంటనే తాను టీవీని ఆఫ్ చేస్తానని, కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందన్నది తనకు తెలియదని సెహ్వాగ్ అన్నాడు. తర్వాతి రోజు తాను నిద్ర లేచిన తర్వాత సోషల్ మీడియా ద్వారా విషయం తెలిసిందన్నాడు. మైదానంలో జరిగింది సరికాదని అభిప్రాయపడ్డాడు. ఓడిన జట్టు ఓటమిని అంగీకరించి వెళ్లిపోవాలని, గెలిచిన జట్టు సంబరాలకు వెళ్లిపోవాలని అన్నాడు. వారు ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. తానెప్పుడూ ఒకటే చెబుతానని, వీరు దేశానికి చిహ్నాలని, వారు ఏం చేసినా, ఏం చెప్పినా పిల్లలు వారిని అనుసరిస్తారని అన్నాడు. నేను అభిమానించే ఆటగాడు ఇలా చేశాడు కాబట్టి తాను కూడా అలా చేయొచ్చని వారు అనుకుంటారని, ఇది చాలా ప్రమాదకరమన్నాడు. కాబట్టి వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు.

బీసీసీఐ కనుక ఎవరినైనా నిషేధించాలని నిర్ణయిస్తే అప్పుడు ఇలాంటి ఘటనలు అరుదుగా గానీ, లేదంటే అస్సలు జరగకుండా కానీ ఉంటాయని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని అన్నాడు. కాబట్టి ఇలాంటి డ్రెస్సింగ్ రూముకు పరిమితం చేయాలని సూచించాడు. మైదానంలో ఇలాంటివి చూడ్డానికి బాగుండవని అన్నాడు. తన పిల్లలు కానీ, మరెవరైనా కానీ రేప్పొద్దున ఇలాంటివి చేస్తారని అన్నాడు. అలా ఎందుకు? అని అడిగితే వారు (కోహ్లీ, గంభీర్) చేశారు కాబట్టి తాము కూడా చేశామని చెబుతారని సెహ్వాగ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-05-04T15:46:20+05:30 IST