Prabath Jayasuriya: 71 సంవత్సరాల నాటి రికార్డును బద్దలుగొట్టిన శ్రీలంక స్పిన్నర్

ABN , First Publish Date - 2023-04-28T18:44:33+05:30 IST

ఐర్లాండ్‌ (Ireland)తో గాలెలో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక (Sri Lanka) స్పిన్నర్ ప్రభాత్

 Prabath Jayasuriya: 71 సంవత్సరాల నాటి రికార్డును బద్దలుగొట్టిన శ్రీలంక స్పిన్నర్

గాలె: ఐర్లాండ్‌ (Ireland)తో గాలెలో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక (Sri Lanka) స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య(Prabath Jayasuriya) 71 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టాడు. ఈ టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాల్ స్టిర్లింగ్ వికెట్‌ను పడగొట్టడం ద్వారా ప్రభాత్ తన ఖాతాలో 50 వికెట్‌ను వేసుకున్నాడు. ప్రభాత్‌కు ఇది ఏడో టెస్టు మాత్రమే. ఫలితంగా అతి తక్కువ టెస్టు మ్యాచుల్లోనే 50 వికెట్ల మైలురాయిని అందుకున్న స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో 71 ఏళ్ల క్రితం నాటి రికార్డు బద్దలైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్‌ బౌలర్ అల్ఫ్ వేలంటైన్‌ పేరున ఉంది. ఇప్పుడా రికార్డును 31 ఏళ్ల ప్రభాత్ జయసూర్య బద్దలుగొట్టాడు.

ప్రభాత్ గతేడాది జులైలో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో 177 పరుగులిచ్చి 12 వికెట్లు పడగొట్టి తొలి మ్యాచ్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. జయసూర్య ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. గాలెలో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటికే రెండుసార్లు ఒక మ్యాచ్‌లో పదేసి వికెట్లు సాధించిన జయసూర్య.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో ఐదు వికెట్లు తీసుకుని ఉంటే మూడుసార్లు పదేసి వికెట్లు సాధించిన ఘనతను సొంతం చేసుకుని ఉండేవాడు.

1950లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విండీస్ స్పిన్నర్ వేలెంటైన్ నాలుగు టెస్టుల్లోనే 33 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా తొలిసారి విండీస్ జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ తర్వాత 1951/52 విండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ జట్టుతో జరిగిన నాలుగో టెస్టులో ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ 50వ వికెట్ సాధించాడు. అంటే మొత్తంగా 8 టెస్టుల్లో వేలంటైన్ 50 వికెట్లు సాధించాడు. ఇప్పుడు ప్రభాత్ జయసూర్య 7 టెస్టుల్లోనే 50 వికెట్లు సాధించి 71 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టాడు.

ఇక, ఓవరాల్‌గా చూసుకుంటే సౌతాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్‌కు చెందిన టామ్ రిచర్డ్‌సన్ ఇద్దరూ ఏడు టెస్టుల్లోనే 50 వికెట్లు సాధించారు. ఫిలాండర్ 2012లో, రిచర్డ్‌సన్ 1896లో ఈ ఘనత అందుకున్నారు. అయితే, వీరిద్దరూ పేసర్లు.

Updated Date - 2023-04-28T18:44:33+05:30 IST