India vs Australia: ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. సర్ఫరాజ్‌కు మళ్లీ చెయ్యిచ్చిన బీసీసీఐ!

ABN , First Publish Date - 2023-02-19T21:26:22+05:30 IST

ఆస్ట్రేలియా(Australia)తో జరగనున్న చివరి రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టు

India vs Australia: ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. సర్ఫరాజ్‌కు మళ్లీ చెయ్యిచ్చిన బీసీసీఐ!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా(Australia)తో జరగనున్న చివరి రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టు(Team India)ను ప్రకటించింది. దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌(Sarfaraz Khan)కు మరోమారు నిరాశే ఎదురైంది. ఇక, టెస్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌(KL Rahul)ను 17 మంది సభ్యులు జట్టులో ఉంచినప్పటికీ అతడి నుంచి వైస్ కెప్టెన్సీని దూరం చేసింది. రాహుల్ బ్యాట్ నుంచి ఏడాది కాలంగా పరుగులు రావడం లేదు. అయినప్పటికీ జట్టులో చోటు మాత్రం దక్కుతుండడం తీవ్ర విమర్శలకు చోటిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లోనూ రాహుల్ రాణించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 20, 17, 1 పరుగులు చేశాడు.

రాహుల్‌కు కనుక తుది జట్టులో స్థానం లభిస్తే యువ ఆటగాడు శుభమన్ గిల్(Shubman Gill) బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక, మిగతా జట్టులో మాత్రం బీసీసీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. విచిత్రంగా చివరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా ఎవరి పేరును ప్రకటించలేదు. స్పిన్ విభాగం బాధ్యతను అశ్విన్, రవీంద్ర జడేజాలకు అప్పగించగా, వారికి అక్షర్ పటేల్ తోడుగా ఉంటాడు. కుల్దీప్ యాదవ్ నాలుగో స్పిన్నర్. అయితే, అతడు ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో బంతి పట్టలేదు. అలాగే, నలుగురు పేసర్లు ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ సిరాజ్‌లు పేస్ దళాన్ని నడిపిస్తారు. తొలి రెండు మ్యాచ్‌లకు ఉమేశ్ యాదవ్, ఉనద్కత్‌లకు చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు ఢిల్లీ టెస్టుకు ముందు ఉనద్కత్‌ను రిలీజ్ చేసింది.

ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించింది. మార్చి 1న మూడో టెస్టు, 9న నాలుగో టెస్టు ప్రారంభమవుతాయి. ఈ రెండింటికీ వరుసగా ఇండోర్, అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తాయి. టెస్టు సిరీస్ ముగిశాక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

Updated Date - 2023-02-19T21:26:23+05:30 IST