Share News

Cricket: SMATలో రికార్డు స్కోరు.. 20 ఓవర్లలో 275 పరుగులు

ABN , First Publish Date - 2023-10-17T15:31:27+05:30 IST

టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భారీ స్కోరు నమోదైంది. పంజాబ్ జట్టు ఈ మేరకు చరిత్ర సృష్టించింది. ఆంధ్రాపై 20 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా ఆరు వికెట్ల నష్టానికి 275 పరుగుల స్కోరు సాధించింది.

Cricket: SMATలో రికార్డు స్కోరు.. 20 ఓవర్లలో 275 పరుగులు

ఇండియాలో దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆటగాళ్లు భావిస్తారు. ఈ ట్రోఫీలో రాణిస్తే జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తుందని ఆరాటపడుతుంటారు. దీంతో SMATలో రాణించాలని యువఆటగాళ్లు భావిస్తున్నారు. తాజాగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భారీ స్కోరు నమోదైంది. పంజాబ్ జట్టు ఈ మేరకు చరిత్ర సృష్టించింది. ఆంధ్రాపై 20 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా ఆరు వికెట్ల నష్టానికి 275 పరుగుల స్కోరు సాధించింది. దీంతో ఈ ట్రోఫీలో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగగా.. అన్మోల్ ప్రీత్‌సింగ్ 87 పరుగులు చేసి రాణించాడు. ముఖ్యంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ 51 బాల్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు సాధించాడు. ఇక అన్మోల్ ప్రీత్‌సింగ్ 26 బాల్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు.

ఇది కూడా చదవండి: Team India: సీక్రెట్ రివీల్ చేసిన హార్దిక్ పాండ్యా.. మంత్రం గురించి ఏం చెప్పాడంటే..?

పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఆంధ్రా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేసిన హరిశంకర్‌రెడ్డి 66 పరుగులు, పృథ్వీరాజ్ 63 పరుగులు ఇవ్వగా త్రిపురన విజయ్ 58 పరుగులు ఇచ్చాడు. లలిత్ మోహన్ 47 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 276 పరుగుల లక్ష్యఛేదనలో ఆంధ్రా 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. రికీ భుయ్ ఒక్కడే సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు తేలిపోవడంతో ఆంధ్రాకు పరాజయం తప్పలేదు. కెప్టెన్ శ్రీకర్ భరత్ (1), హనుమా విహారి (8) తీవ్రంగా నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

Updated Date - 2023-10-17T15:31:27+05:30 IST