Share News

Asad Shafiq: సెలక్టర్‌గా ప్రమోషన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ క్రికెటర్ వీడ్కోలు

ABN , First Publish Date - 2023-12-11T17:16:20+05:30 IST

Asad Shafiq: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ అసద్ షఫీఖ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే సెలక్టర్ పదవి కోసమే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా చేరేందుకు అసద్ షఫీఖ్‌కు మార్గం సుగమం అయిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Asad Shafiq: సెలక్టర్‌గా ప్రమోషన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ క్రికెటర్ వీడ్కోలు

పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ అసద్ షఫీఖ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే సెలక్టర్ పదవి కోసమే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా చేరేందుకు అసద్ షఫీఖ్‌కు మార్గం సుగమం అయిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ చేరలేకపోయింది. దీంతో ఆ జట్టు ప్రక్షాళనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. వరల్డ్ కప్ ముగియగానే కెప్టెన్ పదవికి బాబర్ ఆజమ్ వీడ్కోలు పలికాడు. అంతేకాకుండా సెలక్షన్ కమిటీపై కూడా వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో శిక్ష అనుభవించిన సల్మాన్ భట్‌కు సెలక్షన్ కమిటీలో ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీని కూడా ప్రక్షాళన చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ మేరకు 38 ఏళ్ల అసద్ షఫీఖ్‌ను సెలక్టర్‌గా నియమించాలని నిర్ణయించింది. మైదానంలోకి దిగాలనే ఆసక్తి క్రమంగా తగ్గిపోతోందని.. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే ఫిట్‌నెస్‌ కూడా ఉండాలని.. అది సాధ్యం కాని పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానని అసద్ షఫీఖ్ వెల్లడించాడు. సెలక్టర్‌గా తనకు బోర్డు నుంచి కాంట్రాక్ట్ అందిందని.. త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం కత్తి మీద సాము లాంటిది అని.. అది చాలా కఠినంగా ఉన్నప్పటికీ సవాళ్లను ఎదుర్కొని పనిచేస్తానని అసద్ షఫీఖ్ స్పష్టం చేశాడు. కాగా అసద్ షఫీఖ్ 2020లో చివరి మ్యాచ్ ఆడాడు. మూడేళ్లు దేశవాళీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి సెలక్టర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T17:16:21+05:30 IST