Share News

Haris Rauf: ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్‌కు వచ్చిన క్రికెటర్.. వీడియో వైరల్

ABN , Publish Date - Dec 23 , 2023 | 04:03 PM

Haris Rauf: సాధారణంగా యుద్ధరంగంలోకి సైనికుడు క‌త్తితో ఎలా దిగుతాడో క్రికెట్‌లో కూడా బ్యాట‌ర్ ప్యాడ్స్‌, హెల్మెట్ వంటివి తప్పక ధరిస్తారు. కానీ పాకిస్థాన్ ఆటగాడు హారిస్ రౌఫ్ మాత్రం ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్‌కు వచ్చాడు.

Haris Rauf: ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్‌కు వచ్చిన క్రికెటర్.. వీడియో వైరల్

ఇండియాలో ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉంటుందో.. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం 13వ బిగ్‌బాష్ లీగ్ జరుగుతోంది. అయితే ఈ లీగ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సాధారణంగా యుద్ధరంగంలోకి సైనికుడు క‌త్తితో ఎలా దిగుతాడో క్రికెట్‌లో కూడా బ్యాట‌ర్ ప్యాడ్స్‌, హెల్మెట్ వంటివి తప్పక ధరిస్తారు. కానీ పాకిస్థాన్ ఆటగాడు హారిస్ రౌఫ్ మాత్రం ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్‌కు వచ్చాడు. సిడ్నీ థండర్‌తో మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ చివరి ఓవర్‌లో వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే తనకు బ్యాటింగ్ రాదనుకుని భావించిన హారిస్ రౌఫ్ ప్యాడ్లు కట్టుకోలేదు. తన జట్టు వికెట్లు టపాటపా పడిపోగానే అతడు బ్యాటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో సమయం వృథా కాకుడదనే ఉద్దేశంతో 19.5 ఓవర్ల వద్ద అతడు ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్‌కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే ఒక్క బాల్ మిగిలి ఉన్న సమయంలో బరిలోకి దిగడంతో రౌఫ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే హారిస్ రౌఫ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్‌లు రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అవతల బౌలింగ్ చేసేవాడు ఏ ఉమ్రాన్ మాలికో, షోయబ్ అక్తర్ లాంటి వాడు అయితే రౌఫ్ పని అంతే సంగతులు అని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా దేశవాళీ క్రికెట్‌లో పలువురు ఆటగాళ్లు ప్యాడ్లు కట్టుకోకుండానే బరిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ బిగ్‌బాష్ లాంటి ఆదరణ ఉన్న టోర్నీలో అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతున్న సమయంలో ప్యాడ్లు కట్టుకోకుండా మైదానంలోకి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 23 , 2023 | 04:03 PM