Share News

T20 World Cup 2024: పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడబోతున్న నేపాల్

ABN , First Publish Date - 2023-11-03T18:53:54+05:30 IST

పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ కోసం నేపాల్ అర్హత సాధించింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ తలపడనుంది. పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించడం నేపాల్‌కు ఇది రెండో సారి.

T20 World Cup 2024: పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడబోతున్న నేపాల్

టీ20 ప్రపంచకప్ 2024 కోసం ప్రస్తుతం ఆసియా జట్ల క్వాలిఫయర్స్ టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు నేపాల్, యూఏఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో యూఏఈని 8 వికెట్ల తేడాతో నేపాల్ చిత్తు చేసింది. దీంతో పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం నేపాల్‌కు ఇది రెండో సారి. గతంలో 2014లో టీ20 ప్రపంచకప్ ఆడిన నేపాల్ పదేళ్ల తర్వాత 2024లో రెండోసారి పొట్టి ప్రపంచకప్‌లో హేమాహేమీ జట్లతో తలపడనుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా 2024లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే నేరుగా 12 జట్లకు అర్హత కల్పించింది. వీటిలో ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్, అమెరికా జట్లతో పాటు ఐసీసీ టాప్-10లో ఉన్న టీమ్స్ ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి.

2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఐసీసీ ప్రకటించిన 12 జట్లతో పాటు మరో 8 జట్లు క్వాలిఫైయింగ్ పోటీల ద్వారా ఎంపిక కానున్నాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా ఇప్పటికే ఐర్లాండ్‌, పపువా న్యూగినియా, స్కాట్లాండ్‌, కెనడా అర్హత సాధించగా.. తాజాగా ఈ జాబితాలో నేపాల్‌, ఒమన్ చేరాయి. ఈరోజు యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. 135 పరుగుల లక్ష్యాన్ని నేపాల్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 17.1 ఓవర్లలో ఛేదించింది. నేపాల్ బ్యాటర్లలో ఓపెనర్ ఆసిఫ్ షేక్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు 51 బాల్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ కూడా 34 పరుగులతో తన వంతు సహకారం అందించాడు.

Updated Date - 2023-11-03T18:57:46+05:30 IST