Nathan Lyon: ఢిల్లీ టెస్టులో నాథన్ లయన్ అత్యంత అరుదైన రికార్డు

ABN , First Publish Date - 2023-02-18T18:42:23+05:30 IST

అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియాపై

Nathan Lyon: ఢిల్లీ టెస్టులో నాథన్ లయన్ అత్యంత అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: భారత్‌(Team India)తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ బౌలర్ నాథన్ లయన్(Nathan Lyon) అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియాపై 100 వికెట్లు పడగొట్టిన తొలి ఆస్ట్రేలియా బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇండియాతో ఆడుతున్న 24వ టెస్టులో కేఎస్ భరత్(KS Bharat) వికెట్‌ను తీయడం ద్వారా నాథన్ ఈ ఘనత అందుకున్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో 100 వికెట్లు, ఆపైన సాధించిన బౌలర్లలో టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(Anil Kumble), వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఉన్నారు. కుంబ్లే 20 మ్యాచుల్లో 111 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, అశ్విన్ 20 మ్యాచుల్లో 100 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు లయన్ వీరి సరసన చేరాడు.

లయన్ మరో రికార్డు

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ను కొల్లగొట్టి 5 వికెట్లను పడగొట్టిన లయన్ మరో రికార్డును కూడా తన పేర రాసుకున్నాడు. భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన ఇది ఏకంగా ఎనిమిదోసారి. టీమిండియాపై మరెవరూ ఈ ఘనత సాధించలేదు. అంతకుముందు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) భారత్‌పై ఏడుసార్లు ఆ ఘనత సాధించాడు. ఇప్పుడా రికార్డును లయన్ అధిగమించాడు.

Updated Date - 2023-02-18T18:42:25+05:30 IST