NZ vs SL: విలియమ్సన్ ‘డబుల్’.. ఆ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్‌గా రికార్డు!

ABN , First Publish Date - 2023-03-18T20:25:53+05:30 IST

శ్రీలంక(Sri Lanka)తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్(New Zealand)..

NZ vs SL: విలియమ్సన్ ‘డబుల్’.. ఆ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్‌గా రికార్డు!

వెల్లింగ్టన్: శ్రీలంక(Sri Lanka)తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్(New Zealand).. వెల్లింగ్టన్‌లో జరుగుతున్న రెండో టెస్టులోనూ పట్టుబిగించింది. కేన్ విలియమ్సన్(Kane Williamson), హెన్రీ నికోలస్(Henry Nichollas) డబుల్ సెంచరీలతో విరుచుకుపడడంతో 580/4 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

విలియమ్సన్ 296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215 పరుగులు చేసి అవుట్ కాగా, నికోలస్ 240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నికోలస్‌కు ఇదే తొలి ద్విశతకం. అతడు ‘డబుల్’ పూర్తిచేయగానే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ అజేయ సెంచరీ (121) సాధించి జట్టును గెలిపించిన విలియమ్సన్ ఈ టెస్టులో డబుల్ సెంచరీ సాధించి ఓ ఘనమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

8 వేల టెస్టు పరుగులు సాధించిన తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. గత నెలలో ఇంగ్లండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన టెస్టులో రాస్ టేలర్ 7,683 పరుగులను దాటేసి అత్యధిక పరుగులు సాధించిన కివీస్ ఆటగాడిగా రికార్డులకెక్కిన విలియమ్సన్.. ఇప్పుడు 8 వేల పరుగులు సాధించిన తొలి కివీస్ ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

టేలర్ 112 టెస్టుల్లో 7,683 పరుగులు చేయగా, విలియమ్సన్ 94 మ్యాచుల్లోనే 8,124 పరుగులు సాధించాడు. అంతేకాదు, టెస్టుల్లో కేన్‌కు ఇది ఆరో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా మర్వన్ అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావెద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో కోహ్లీ ఒక్కడే 7 డబుల్ సెంచరీలతో అందరికంటే ముందున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నమోదైంది. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు డబుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒషాడా ఫెర్నాండో (6), కుశాల్ మెండిస్ (0) వికెట్లను కోల్పోయి 26 పరుగులు చేసింది.

Updated Date - 2023-03-18T20:29:59+05:30 IST