IPL 2023: సుడి అంటే గుజరాత్‌దే.. చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయలేక ఓటమి పాలైన లక్నో

ABN , First Publish Date - 2023-04-22T19:41:28+05:30 IST

చూస్తుంటే ఐపీఎల్‌(IPL 2023)లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సుడి ఉన్నట్టే

IPL 2023: సుడి అంటే గుజరాత్‌దే.. చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయలేక ఓటమి పాలైన లక్నో

లక్నో: చూస్తుంటే ఐపీఎల్‌(IPL 2023)లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సుడి ఉన్నట్టే కనిపిస్తోంది. లేకపోతే 135 పరుగుల స్కోరు చేసి కూడా గెలవడం ఏంటి? కేఎల్ రాహుల్ (KL Rahul), ఆయుష్ బదోని(Ayush Badoni) వంటి వారు క్రీజులో ఉండి కూడా లక్నో ఆరు బంతులకు 12 పరుగులు కొట్టలేకపోవడం ఏంటి? బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఈ మ్యాచ్ ఐపీఎల్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. చివరి వరకు లక్నో (Lucknow) గెలుస్తుందని ఊహించిన అభిమానులకు చివరి ఓవర్ వేసిన మోహిత్ శర్మ(Mohit Sharma) షాకిచ్చాడు. బంతులతో బెంబేలెత్తించి వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు రనౌట్లు ఉన్నాయి.

గుజరాత్ (Gujarat) నిర్దేశించిన 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసి చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. రాహుల్ క్రీజులో ఉన్నంత వరకు విజయం లక్నో వైపే మొగ్గింది. సరిగ్గా అదే సమయంలో చురుగ్గా ఆలోచించిన గుజరాత్ కెప్టెన్ పాండ్యా.. మోహిత్ శర్మకు బౌలింగ్ ఇచ్చి సరైన నిర్ణయం తీసుకున్నాడు.

చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 12 పరుగులు అవసరం కాగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. దీంతో విజయం తప్పదని అందరూ భావించారు. అయితే, మోహిత్ శర్మ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తొలి బంతికి రాహుల్ 2 పరుగులు చేశాడు. రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి జయంత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టోయినిస్.. మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లక్నోను కష్టాలు చుట్టుముట్టాయి.

ఆ తర్వాత బంతికి ఆయుష్ బదోనీ, ఐదో బంతికి దీపక్ హుడా అవుటయ్యారు. చివరి బంతికి వికెట్ రాలేదు. దీంతో లక్నో ఇన్నింగ్స్ 128 పరుగుల వద్ద ముగిసింది. గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రాహుల్ 68 పరుగులు చేయగా, మేయర్ 24, కృనాల్ పాండ్యా 23 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 66, వృద్ధిమాన్ సాహా 47 పరుగులు చేశారు.

Updated Date - 2023-04-22T19:41:28+05:30 IST