IPL 2023: కప్పుపైనే ఢిల్లీ గురి.. తీర్చేనా వార్నర్ మరి!

ABN , First Publish Date - 2023-03-28T16:29:08+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌కు అంతా రెడీ అయింది. జట్లు అన్నీ ప్రాక్టీస్‌లో

IPL 2023: కప్పుపైనే ఢిల్లీ గురి.. తీర్చేనా వార్నర్ మరి!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌కు అంతా రెడీ అయింది. జట్లు అన్నీ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఈసారైనా కప్పుకొట్టాలని ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) పట్టుదలగా ఉంది. గత నాలుగేళ్లుగా చక్కని పోరాట పటిమ కనబరుస్తున్నప్పటికీ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మారింది. జేఎస్ డబ్ల్యూ(JSW), జీఎంఆర్ గ్రూప్(GMR Group) యాజమాన్యంలోని ఢిల్లీ కేపిటల్స్ 2012 తర్వాత తొలిసారి 2019లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత నిరాశాజనక ఆటతీరుతో ఇంటి ముఖం పట్టింది. 2020లో రన్నరప్‌గా నిలిచి సంతోషపడింది. 2021లో ప్లే ఆఫ్స్‌లో, గత సీజన్‌లో లీగ్ దశలోనే పోరాటాన్ని ముగించింది.

గతేడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) శస్త్రచికిత్స తర్వాత క్రమంగా కోలుకుంటున్నాడు. దీంతో ఈ లీగ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు వదిలించుకున్న డేవిడ్ వార్నర్‌(David Warner)ను తీసుకోవడమే కాకుండా ఇప్పుడతడిని కెప్టెన్‌గా నియమించింది. 2016లో వార్నర్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అయితే, ఆ తర్వాత వార్నర్ ప్రదర్శన దిగజారడంతో 2021లో వార్నర్‌ను పక్కనపెట్టి కెప్టెన్సీని కేన్ విలియమ్సన్‌(Kane Williamson)కు అప్పగించింది. ఆ తర్వాత వార్నర్‌కు, హైదరాబాద్ ఫ్రాంచైజీకి మధ్య కుదరకపోవడంతో వార్నర్‌ను వదులుకుంది. దీంతో ఢిల్లీ కేపిటల్స్ జట్టు వేలంలో అతడిని దక్కించుకుంది.

వార్నర్‌కు ప్రతిభకు పరీక్ష

పంత్ స్థానంలో జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికైన వార్నర్.. ఈ సీజన్‌లో చెలరేగి జట్టుకు ట్రోఫీ అందించాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు. ఓపెనర్‌గా వార్నర్ 12 మ్యాచుల్లో ఏకంగా 432 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 నాటౌట్. ఈసారి ఢిల్లీ జట్టు తమ మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకఫ్‌లో సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా ప్లేయర్ రిలీ రోసౌలను తీసుకుంది. పంత్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో సాల్ట్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. వీరితోపాటు సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్‌లను తీసుకోవడం ద్వారా జట్టును మరింత బలోపేతం చేసుకుంది.

నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్లు అన్రిక్ నోకియా, లుంగి ఎంగిడి ఏప్రిల్ 3న జట్టుతో కలుస్తారు. ఢిల్లీ కేపిటల్స్ ఏప్రిల్ 1న తన తొలి మ్యాచ్ ఆడుతుంది. అదే నెల 4న రెండో మ్యాచ్ ఆడుతుంది. దీంతో, ఈ సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇద్దరూ తొలి రెండు మ్యాచ్‌లను మిస్సయినట్టే.

Updated Date - 2023-03-28T16:29:14+05:30 IST