Indore Test: రెండో ఇన్నింగ్స్‌లోనూ మారని భారత్ ఆటతీరు.. పెవిలియన్‌కు టాపార్డర్ క్యూ

ABN , First Publish Date - 2023-03-02T15:52:08+05:30 IST

ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లకు

Indore Test: రెండో ఇన్నింగ్స్‌లోనూ మారని భారత్ ఆటతీరు.. పెవిలియన్‌కు టాపార్డర్ క్యూ

ఇండోర్‌: ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లకు తలవంచిన భారత(Team India) బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తీవ్రంగా నిరాశ పరిచారు. 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. మనోళ్ల ఆటతీరు చూస్తుంటే మ్యాచ్ ఈ రోజే ముగిసేలా కనిపిస్తోంది.

197 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 15 పరుగుల వద్దే శుభమన్ గిల్ (5) పెవిలియన్ చేరాడు. అది మొదలు వికెట్లు క్రమం తప్పకుండా కోల్పోతూ వచ్చిన భారత జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆదుకుంటాడనుకున్న కోహ్లీ (13), రవీంద్ర జడేజా (7) ఉసూరుమనిపించారు. శ్రేయాస్ అయ్యర్ 26, శ్రీకర్ భరత్ 3 పరుగులు చేశాడు. బ్యాటర్లందరూ పెవిలియన్ చేరినా క్రీజులో పాతుకుపోయిన చతేశ్వర్ పుజారా మాత్రం అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. పుజారా (50), రవిచంద్రన్ అశ్విన్ (11) క్రీజులో ఉన్నారు. భారత్‌ ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్‌ 4 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 156/4తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్ మరో 41 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయ్యారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ ఉమేష్ యాదవ్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. హ్యాండ్స్‌కోంబ్(19), అలెక్స్ క్యారీ(3), లియోన్(5)లను అశ్విన్ బోల్తా కొట్టించగా.. గ్రీన్(21), స్టార్క్(1), టీ ముర్ఫీ(0)లను ఉమేష్ యాదవ్ వెనక్కిపంపించాడు. దీంతో ఆసీస్‌కు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

Updated Date - 2023-03-02T15:55:50+05:30 IST