Ind vs Aus: న్యూజిలాండ్ మరో 257 పరుగులు చేస్తే.. భారత్ గట్టెక్కినట్టే!

ABN , First Publish Date - 2023-03-12T20:21:24+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో

 Ind vs Aus: న్యూజిలాండ్ మరో 257 పరుగులు చేస్తే.. భారత్ గట్టెక్కినట్టే!

అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో అహ్మదాబాద్‌‌లో జరుగుతున్న టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు(Team India) గెలవడం దాదాపు అసాధ్యం. ఊహించని అద్భుతం జరిగి రోహిత్ సేన(Rohit Team) విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌లో చోటు ఖాయమవుతుంది. అది దాదాపు అసాధ్యం. టెస్టు డ్రాగా ముగిసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సిరీస్ 2-1తో భారత్ సొంతమవుతుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా చోటు ప్రశ్నార్థకం అవుతుంది. మూడో టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ప్రవేశించింది.

కివీస్ పైనే భారం..

మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా 68.52 పర్సంటేజీతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఇండియా 60.29 శాతానికి పడిపోయినప్పటికీ రెండో స్థానంలోనే ఉంది. శ్రీలంక (Sri Lanka) 53.33 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా(South Africa) 55.56 శాతంతో మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఆ జట్టు కథ ముగింది. దానికిప్పుడు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. కాబట్టి నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంకకే ఫైనల్ చాన్స్ ఉంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టు డ్రా అయితే టీమిండియా 59.0 పర్సంటేజీతో మూడో స్థానానికి పరిమితం అవుతుంది. అప్పుడు శ్రీలంక ఫైనల్‌కు వెళ్లే చాన్సుంది. అలా జరగకుండా ఉండాలంటే న్యూజిలాండ్‌‌తో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టుతో పాటు రెండో టెస్టులోనూ శ్రీలంక ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం పాయింట్ల పట్టికలో భారత్‌ను శ్రీలంక అధిగమిస్తుంది. 61.0 శాతంతో రెండో స్థానానికి చేరుకుంటుంది. అప్పుడు భారత్ ఆశలు గల్లంతవుతాయి. అయితే, భారత్‌కు మరో చాన్స్ కూడా ఉంది. శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య సిరీస్ 1-1తో డ్రా అయినా, శ్రీలంక 1-0తో విజయం సాధించినా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లే చాన్సుంది.

కివీస్ ఇంకో 257 పరుగులు చేస్తే..

sri-Lanka.jpg

క్రైస్ట్‌చర్చ్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఈ టెస్టులో విజయం సాధించాలంటే ఆ జట్టు మరో 257 పరుగులు సాధించాల్సి ఉంటుంది. మరో రోజు మిగిలి ఉండగా చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. కాబట్టి న్యూజిలాండ్‌‌ను విజయం ఊరిస్తోంది. మరోవైపు, శ్రీలంక కూడా గెలుపుపై కన్నేసింది. బౌలర్లు కనుక విజృంభిస్తే విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. విజయం కోసం ఆడుతూనే కుదరని పక్షంలో డ్రాగా ముగించేందుకు కూడా న్యూజిలాండ్ ప్రయత్నించవచ్చు. కాబట్టి ఐదో రోజు ఏదైనా జరిగే అవకాశం ఉంది. భారత అభిమానులు మాత్రం అయితే డ్రా, లేదంటే న్యూజిలాండ్ విజయాన్ని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Updated Date - 2023-03-12T20:45:06+05:30 IST