ICC Womens T20 World Cup 2023: పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. గెలుపుతో వేట మొదలు..

ABN , First Publish Date - 2023-02-12T23:17:40+05:30 IST

కేప్‌టౌన్ వేదికగా ఐసీసీ ఉమెన్ టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు..

ICC Womens T20 World Cup 2023: పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. గెలుపుతో వేట మొదలు..

కేప్‌టౌన్ వేదికగా ఐసీసీ ఉమెన్ టీ20 వరల్డ్‌ కప్‌లో (ICC Womens T20 World Cup 2023) భాగంగా టీమిండియా, పాకిస్థాన్ (IND vs PAK) మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (India Won By 7 Wickets) ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌ను (PAK) ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే 151 పరుగులు చేసి ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. టీమిండియా బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) 53 పరుగులతో రాణించి హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, షఫాలీ వర్మ 33 పరుగులు, రిచా ఘోష్ (Richa Ghosh) 31 పరుగులతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. 38 పరుగుల స్కోర్ వద్ద టీమిండియా యస్తికా భాటియా వికెట్‌ను కోల్పోయింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె ఔట్ అయింది. 65 పరుగుల వద్ద షఫాలీ వర్మ క్యాచ్‌గా దొరికిపోవడంతో రెండో వికెట్ పడింది.

FoyLuEVaMAEtvYO.jpg

93 పరుగుల వద్ద హర్మన్‌ ప్రీత్ కౌర్ 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ చేరింది. ఇలా టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. రోడ్రిగ్స్, రిచా ఘోష్ నిలకడగా రాణించి 84 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి నాటౌట్‌గా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లతో రాణించగా, సదియా ఇక్బాల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక.. పాక్ బ్యాటింగ్ విషయానికొస్తే.. మరూఫ్ 55 బంతుల్లోనే 7 ఫోర్లతో 68 పరుగులు చేసి దూకుడుగా ఆడింది. ఆయేషా నసీమ్ 25 బంతుల్లోనే 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 43 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచింది.

team-india.jpg

టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లతో రాణించగా, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. గత ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరింది కానీ రన్నర్‌పతోనే సరిపెట్టుకుంది. అయితే ఈసారి ఎలాగైనా మెగా కప్‌ను ముద్దాడాలని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌ కప్‌లో ఆదివారం జరిగిన తమ గ్రూప్‌-బి ఆరంభ పోరులో పాకిస్థాన్‌ను ఢీకొట్టడమే కాకుండా పడగొట్టి గెలుపుతో వేట మొదలుపెట్టింది. ప్రత్యర్థితో పోలిస్తే అన్ని విభాగాల్లో హర్మన్‌ సేన పటిష్టంగా ఉండటం టీమిండియాకు కలిసొచ్చింది.

Fox3tFkacAAsf2A.jpg

ఇక టోర్నీలో ఆసీస్‌ను ఎదుర్కోవాలంటే జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటాలి. తొలి పోరుకుముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వేలి గాయంతో వైస్‌-కెప్టెన్‌ స్మృతి మంధాన పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైంది. అయితే వేలు ఫ్రాక్చర్‌ కాలేదని కోచ్‌ కనిట్కర్‌ శనివారం వెల్లడించాడు. దరిమిలా రెండో మ్యాచ్‌ నుంచి స్మృతి అందుబాటులో ఉండనుండటం జట్టుకు ఊరట కలిగించింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది.

Updated Date - 2023-02-12T23:27:03+05:30 IST