ICC Womens T20 World Cup 2023: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. సఫారీలతో అమీతుమీ!

ABN , First Publish Date - 2023-02-26T18:14:35+05:30 IST

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో దక్షిణాఫ్రికాతో జరగనున్న

ICC Womens T20 World Cup 2023: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. సఫారీలతో అమీతుమీ!

కేప్‌టౌన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరగనున్న ఫైనల్‌లో ఆస్ట్రేలియా(Australia) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ఆసీస్ ఈసారి కూడా కప్పును ఎగరేసుకుపోవాలని గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, ఇంగ్లండ్‌(England)తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టిన సఫారీ జట్టు సొంతగడ్డపై కప్పు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో నేటి పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. గతేడాది సెమీస్ చేరినప్పటికీ ఆ మ్యాచ్‌లో బోల్తాపడిన దక్షిణాఫ్రికా ఆటతీరులో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది.

లారా వోల్వర్డ్‌( Laura Wolvaardt), తజ్మీన్‌ బ్రిట్స్‌(Tazmin Brits) రూపంలో అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ అందుబాటులో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అలాగే, ఆల్‌రౌండర్‌ మరిజానే కాప్‌(Marizanne Kapp)తోపాటు పేస్‌ ద్వయం షబ్నిం ఇస్మాయిల్‌, అయోబంగ ఖకా టీమ్‌లో ఉండడంతో కెప్టెన్‌ సునె లుస్‌ విజయంపై ధీమాగా ఉంది. గ్రూప్‌ దశలో ఆసీస్‌ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని కసిగా ఎదురుచూస్తోంది. అయితే, ఆస్ట్రేలియాపై నెగ్గడం అంత ఈజీ కాదు. అందుకు సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది.

మరోవైపు, ఐదుసార్లు వరల్డ్‌కప్‌‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో బలంగా ఉంది. ఈ విజయంతో టైటిళ్లలో సిక్సర్ కొట్టాలని భావిస్తోంది. సెమీస్‌లో టీమిండియా దాదాపుగా ఓడించినంత పని చేసినా.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఒత్తిడిని అధిగమిస్తూ ఆసీస్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో లానింగ్‌, పెర్రీ, హీలీ రాణిస్తున్నారు. ఆల్‌రౌండర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్న ప్లేయర్‌. స్కట్‌, బ్రౌన్‌ బంతితో అదరగొడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

Updated Date - 2023-02-26T18:18:29+05:30 IST