Hardik Pandya: భార్యను మరోమారు గ్రాండ్‌గా పెళ్లాడబోతున్న స్టార్ క్రికెటర్
ABN , First Publish Date - 2023-02-13T17:59:16+05:30 IST
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) సెర్బియాకు
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన తన భార్య నటాసా స్టాంకోవిక్(Nataša Stankovic)ను మరోమారు ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నెల 14న వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం)ను పురస్కరించుకుని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్(Udaipur)లో భార్యను మరోమారు గ్రాండ్‌గా మనువాడబోతున్నాడు.

చాలాకాలం పాటు ప్రేమలో ఉన్న వీరు కరోనా సమయంలో రిజిస్టర్ మ్యారేజీతో ఒక్కటయ్యారు. వీరికో కుమారుడు కూడా ఉన్నాడు. అప్పట్లో పెళ్లి సాదాసీదాగా జరగడంతో ఇప్పుడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మరోమారు ఘనంగా పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పెళ్లి వేడుకలు సోమవారమే (13న) ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు వేడుకలు జరుగుతాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలతో సంప్రదాయబద్ధంగా హార్దిక్-నటాసా వివాహం జరగనుంది.
పెళ్లిలో నటాసా డోల్సే, గబ్బానా గౌన్ ధరించనున్నట్టు తెలుస్తోంది. కాగా, 29 ఏళ్ల హార్దిక్ పాండ్యా, 30 ఏళ్ల నటాసా 31 మే 2020న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. కాగా, హర్దిక్ కానీ, నటాషా కానీ వివాహంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.