Ravi Shastri: అప్పుడు కోహ్లీనే జట్టును నడిపిస్తాడనుకున్నా!

ABN , First Publish Date - 2023-04-28T17:09:51+05:30 IST

అటు టీమిండియా(Team India)కు, ఇటు ఐపీఎల్‌(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)

Ravi Shastri: అప్పుడు కోహ్లీనే జట్టును నడిపిస్తాడనుకున్నా!

న్యూఢిల్లీ: అటు టీమిండియా(Team India)కు, ఇటు ఐపీఎల్‌(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆ తర్వాత రెండు జట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రెండింటలోనూ సాధారణ ఆటగాడిగానే వ్యవహరిస్తున్నాడు. అయితే, గాయం కారణంగా బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, భారత జట్టుకు మాత్రం అలా వ్యవహరించిన సందర్భం లేదు.

ఈ విషయమై తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టుకు కోహ్లీ సారథ్యం వహిస్తాడని ఊహించినట్టు పేర్కొన్నాడు. అప్పట్లో కరోనా బారినపడిన రోహిత్ శర్మ (Rohit Sharma) బర్మింగ్‌హామ్ టెస్టుకు దూరమయ్యాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా సారథ్య బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు జరిగిన నాలుగు టెస్టుకు కోహ్లీనే సారథ్యం వహించాడు. తాను కనుక అప్పుడు కోచ్‌గా ఉండి ఉంటే ఆ టెస్టుకు సారథ్యం వహించమని కోహ్లీని కోరి ఉండేవాడినని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

జట్టుకు రోహిత్ దూరం కావడంతో కోహ్లీనే జట్టును నడిపిస్తాడని తాను భావించానని, బోర్డు అతడిని అడుగుతుందని అనుకున్నానని రవి అన్నాడు. తాను కనుక అప్పుడు అక్కడ ఉండి ఉంటే కోహ్లీని అడిగి ఉండేవాడినని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ కూడా అదే చేసి ఉండేవాడేమో తనకైతే తెలియదని, ఎందుకంటే తాను అతడితో తాను మాట్లాడలేదని అన్నాడు. సిరీస్‌లో 2-1తో ఆధిక్యం ఉన్న జట్టులో కోహ్లీ కూడా భాగం కాబట్టి జట్టుకు అతడు నాయకత్వం వహించడం సమంజసమని బోర్డుకు తాను సిఫార్సు చేసి ఉండేవాడినని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ కోచ్ వివరించాడు.

Updated Date - 2023-04-28T17:09:51+05:30 IST