Share News

ODI World Cup: మాథ్యూస్‌తో వివాదం.. ప్రపంచకప్ నుంచి షకీబ్ అవుట్..!!

ABN , First Publish Date - 2023-11-07T19:23:18+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఎడమచేతి వేలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది.

ODI World Cup: మాథ్యూస్‌తో వివాదం.. ప్రపంచకప్ నుంచి షకీబ్ అవుట్..!!

వన్డే ప్రపంచకప్‌లో ప్రస్తుతం బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటించాలని బంగ్లాదేశ్ కోరడం వివాదానికి దారి తీసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచినా సెమీస్ అవకాశాలకు దూరమైంది. అయితే చివరి లీగ్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఎడమచేతి వేలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షకీబ్ చేతికి స్కానింగ్ నిర్వహించగా ఎక్స్‌రేలో చేతి వేలుకి ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలిందని తెలిపింది. దీంతో మెగా టోర్నీ నుంచి షకీబ్ తప్పుకున్నట్లు వెల్లడించింది.

అయితే షకీబ్ ప్రపంచకప్ నుంచి తప్పుకోవడానికి కారణం మాథ్యూస్ అంశమేనని పలువురు భావిస్తున్నారు. మాథ్యూస్‌ను కావాలనే బంగ్లాదేశ్ కెప్టెన్ హోదాలో పెవిలియన్ చేర్చాడని షకీబ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక ప్రజల శాపాలు తగిలినందుకే షకీబ్ గాయపడ్డాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇంత దిక్కుమాలిన జట్టును తన అంతర్జాతీయ కెరీర్‌లో చూడలేదని మాథ్యూస్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి జట్టు ఇంత దిగజారుతుందని తాను ఊహించలేదన్నాడు. ఫోర్త్ అంపైర్ వివరణను కూడా మాథ్యూస్ తప్పుబట్టాడు. తన హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోయిందని.. దానిని తాను ఇచ్చేసిన తర్వాత ఇంకా ఐదు సెకన్ల టైమ్ మిగిలి ఉందని మాథ్యూస్ వివరించాడు. హెల్మెట్ లేకుండా క్రికెట్ ఎలా ఆడతామని.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎలా ఎదుర్కొంటామని మాథ్యూస్ ప్రశ్నించాడు.

Updated Date - 2023-11-07T19:23:19+05:30 IST