Asia Cup 2023: ఆరంభ వేడుకలు అట్టర్ ఫ్లాప్.. నిరాశపరిచిన వ్యూయర్ షిప్

ABN , First Publish Date - 2023-08-31T14:57:24+05:30 IST

బుధవారం నాడు ఆసియా కప్‌లో ప్రారంభ మ్యాచ్ చప్పగా ముగిసింది. ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య 30 వేల సామర్థ్యం ఉన్న ముల్తాన్ స్టేడియంలో జరిగింది. అయితే 3వేల మంది కూడా లేకపోవడంతో ముల్తాన్ స్టేడియం అంతా బోసిపోయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఈ మ్యాచ్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయగా.. ఏ దశలోనూ వ్యూయర్‌షిప్ సంఖ్య 15 లక్షలు దాటలేదు.

Asia Cup 2023: ఆరంభ వేడుకలు అట్టర్ ఫ్లాప్.. నిరాశపరిచిన వ్యూయర్ షిప్

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఆసియా కప్ ఆరంభం వేడుకలు బుధవారం నాడు చడీచప్పుడు లేకుండా ప్రారంభమయ్యాయి. దీంతో ఈ వేడుకలను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపలేదు. 15 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో ఆసియా కప్ మ్యాచ్ జరగ్గా.. అభిమానులు స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు భావించారు. కానీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. ఆరంభ వేడుకలు జరిగిన ముల్తాన్ స్టేడియానికి 3వేల మంది కూడా రాలేదని తెలుస్తోంది. పాకిస్థాన్ ఆడుతున్నా ఆ దేశ అభిమానులు ఇంట్రస్ట్ చూపలేదు. అయితే దీనికి కారణం పసికూన నేపాల్‌తో ఆరంభ మ్యాచ్ ఏర్పాటు చేయడమేనని పలువురు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: పసికూనపై సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. పాకిస్థాన్ భారీ స్కోరు

బుధవారం నాడు ఆతిధ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్ 30 వేల సామర్థ్యం ఉన్న ముల్తాన్ స్టేడియంలో జరిగింది. అయితే 3వేల మంది కూడా లేకపోవడంతో ముల్తాన్ స్టేడియం అంతా బోసిపోయింది. స్టాండ్స్ అన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ఆరంభ వేడుకలు కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయి. పాకిస్థాన్ సింగర్ అయిమా బైగ్, నేపాలీ సింగర్ త్రిషలా గురంగ్ తమ పాటలతో సందడి చేసినా వీటిని విని ఆనందించేందుకు అభిమానులు స్టేడియంలో లేకపోవడం నిర్వాహకులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. మరోవైపు వ్యూయర్‌షిప్‌లోనూ పాకిస్థాన్-నేపాల్ మ్యాచ్‌కు పెద్దగా ఆదరణ దక్కలేదు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఈ మ్యాచ్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయగా.. ఏ దశలోనూ వ్యూయర్‌షిప్ సంఖ్య 15 లక్షలు దాటలేదు. ఆరంభ మ్యాచ్ పూర్తిగా వన్‌సైడ్ కావడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ అనూహ్యంగా భారీ స్కోరు చేయడంతో నేపాల్ ఓడిపోతుందని క్రికెట్ అభిమానులు ముందే ఊహించారు. దీంతో నేపాల్ బ్యాటింగ్‌ను చూసేందుకు ఎవరూ ఇష్టపడలేదు. అందుకు తగ్గట్టే నేపాల్ ఇన్నింగ్స్ 23.4 ఓవర్లలోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏకంగా 238 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Updated Date - 2023-08-31T14:57:42+05:30 IST