India vs Australia: ‘ఆరే’సిన అశ్విన్.. ఆసీస్ భారీ స్కోరు!

ABN , First Publish Date - 2023-03-10T16:23:35+05:30 IST

భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు(Ahmedabad Test) తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) భారీ స్కోరు సాధించింది.

India vs Australia: ‘ఆరే’సిన అశ్విన్.. ఆసీస్ భారీ స్కోరు!

అహ్మదాబాద్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు(Ahmedabad Test) తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja), కేమరాన్ గ్రీన్(Cameron Green) సెంచరీలతో కదం తొక్కడంతో పర్యాటక జట్టు 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా అదే జోరు కొనసాగించింది.

ఖావాజా, గ్రీన్ ఇద్దరూ టీమిండియా బౌలర్లను ఏమాత్రం తొట్రుపాటు లేకుండా ఎదుర్కొని పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్.. అశ్విన్‌(Ravichandran Ashwin)కు దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఫలితంగా 208 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 170 బంతులు ఆడిన గ్రీన్ 18 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఆ తర్వాత అలెక్స్ కేరీ (0), స్టార్క్ (6) వెంటవెంటనే పెవిలియన్ చేరినప్పటికీ ఖావాజా మాత్రం అదే జోరు కొనసాగించాడు.

150 పరుగులు పూర్తి చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించిన ఖావాజాను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 422 బంతులు ఆడిన ఖావాజా 21 ఫోర్లతో 180 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివర్లో లియాన్ (34), టాడ్ మర్పీ (41) కాసేపు భారత బౌలర్లను ఎదురొడ్డారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా, షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2023-03-10T16:32:53+05:30 IST