Share News

AFG vs SL: మరో ఝలక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకపై అద్భుత విజయం

ABN , First Publish Date - 2023-10-30T22:37:34+05:30 IST

2019 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. ఈ వరల్డ్‌కప్ టోర్నీలో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టుల్ని ఓడించి షాక్‌కు గురి చేసిన ఈ ఆఫ్ఘన్ జట్టు..

AFG vs SL: మరో ఝలక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకపై అద్భుత విజయం

2019 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. ఈ వరల్డ్‌కప్ టోర్నీలో మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టుల్ని ఓడించి షాక్‌కు గురి చేసిన ఈ ఆఫ్ఘన్ జట్టు.. తాజాగా శ్రీలంకను మట్టికరిపించింది. అవును.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు అద్భుత విజయం సాధించింది. లంక కుదిర్చిన 242 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్ల తేడాతో ఛేధించింది. అజ్మతుల్లా (73), హష్మతుల్లా (58), రహ్మత్ షా (62) అర్థశతకాలతో రాణించడం.. జద్రాన్ (39) మెరుగైన ఇన్నింగ్స్ ఆడటం వల్లే ఆఫ్ఘన్ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.


తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింక్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 241 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొదట్లో శ్రీలంక 22 పరుగులకే వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత నిస్సాంక, మెండిస్ నిలకడగానే రాణించారు. ఆచితూచి ఆడుతూ.. జట్టు స్కోరును ముందుకు నడిపించారు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 62 పరుగులు జోడించారు. కానీ.. మెండిస్ ఔట్ అయ్యాక శ్రీలంక జోరు తగ్గింది. క్రమంగా ఈ జట్టు వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఏ ఒక్కరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి వికెట్లు కోల్పోతూ వచ్చారు. చివర్లో తీక్షణ (29) కాస్త మెరుపులు మెరిపించి, జట్టుని తనదైన సహాయం అందించాడు. దీంతో.. శ్రీలంక 241 స్కోరు చేయగలిగింది.

ఇక 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఆదిలోనే పెద్ద ఝలక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు గుర్బాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో.. ఈ జట్టు ఒత్తిడికి గురయ్యింది. బహుశా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిపోతుందేమోనని అందరూ భావించారు. కానీ.. ఆఫ్ఘన్ బ్యాటర్లు అందరి అంచనాల్ని తిప్పికొడుతూ, మెరుగైన ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుని గెలిపించారు. 45.2 ఓవర్లలో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించారు. జద్రాన్, రహ్మత్, హష్మతుల్లా, అజ్మతుల్లా శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొని.. తమ జట్టుని గెలిపించుకున్నారు. అటు.. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫారుఖీ నాలుగు వికెట్లు తీసి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated Date - 2023-10-30T22:37:34+05:30 IST