Ban vs Afg: ఆఫ్ఘన్‌పై టెస్ట్‌లో బంగ్లా విజయం.. 89 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బంగ్లాదేశ్..

ABN , First Publish Date - 2023-06-17T13:50:38+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య బంగ్లాదేశ్ రికార్డు విజయం సాధించింది. ఈ విజయంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో గత 89 ఏళ్లలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా ఇది మూడో అతిపెద్ద విజయం.

Ban vs Afg: ఆఫ్ఘన్‌పై టెస్ట్‌లో బంగ్లా విజయం.. 89 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బంగ్లాదేశ్..

ఢాకా: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య బంగ్లాదేశ్ రికార్డు విజయం సాధించింది. ఈ విజయంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో గత 89 ఏళ్లలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా ఇది మూడో అతిపెద్ద విజయం. వన్‌సైడేడ్‌గా ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 546 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో చెలరేగిన నజ్ముల్ హుస్సేన్ శాంటో (146, 124) బంగ్లాదేశ్ విజయంతో కీలకపాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ధాటిగా ఆడిన శాంటో వన్డే తరహా బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు.

FyzhTlxakAAs2iZ.jpg

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. శాంటో (175 బంతుల్లో 146 పరుగులు.. 23 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో చెలరేగడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ (76.. 9 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మెహిదీ హసన్ మిరాజ్ (48), ముష్కియర్ రహీ(47) కూడా రాణించారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో నిజత్ మసూద్ 5 వికెట్లతో సత్తా చాటాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసిన మసూద్ దాదాపు 5 ఎకానమీతో 79 పరుగులు ఇచ్చినప్పటికీ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటర్ల దారుణ వైఫల్యంతో ఆప్ఘనిస్థాన్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో ఏ ఒక్కరు కనీసం 40 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 236 పరుగుల భారీ అధిక్యం లభించింది.

Fyz2Q6LaUAAmcqh.jpg

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నజ్ముల్ హుస్సేన్ శాంటో ( 151 బంతుల్లో 124 పరుగులు.. 15 ఫోర్లు) సెంచరీతో దుమ్ములేపాడు. శాంటోకు తోడు మోమినుల్ హక్ (145 బంతుల్లో 121 పరుగులు.. 12 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా సెంచరీతో చెలరేగాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన మోమినుల్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. శాంటో, మోమినుల్ విధ్వంసంతో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు తేలిపోయారు. దీంతో బంగ్లాదేశ్ స్కోర్ బోర్డు 5పైగా రన్ రేటుతో పరుగులు పెట్టింది. వీరికి తోడు జాకీర్ హుస్సేన్ (71), లిటన్ దాస్ (66) హాఫ్ సెంచరీతో రాణించారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగుల వద్ద బంగ్లాదేశ్ స్కోర్ బోర్డును డిక్లేర్ చేసింది. దీంతో ఆప్ఘనిస్థాన్ ముందు బంగ్లాదేశ్ జట్టు 662 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో ఈ భారీ లక్ష్యాన్ని చేధించేందుకు ఆప్ఘన్ టీం కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో 546 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది.

Fyvg6lLaEAAUaUp.jpg

బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. కాగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆప్ఘనిస్థాన్ జట్టు కనీసం 200 మార్కు అందుకోకపోవడం గమనార్హం. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో దుమ్ములేపిన నజ్ముల్ హుస్సేన్ శాంటోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది మూడో అతిపెద్ద విజయం. గత 89 ఏళ్లలో ఇదే అతిపెద్ద విజయం. ఈ జాబితాలో ఇంగ్లండ్ మొదటి స్థానంలో ఉంది. 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ జట్టు 675 పరుగులు తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో గెలిచింది. ఇది రెండో అతిపెద్ద విజయం.

Updated Date - 2023-06-17T19:12:30+05:30 IST