Turkey Syria earthquake: కన్నప్రేమంటే ఇదేనేమో.. నాన్నను చూడగానే అంత బాధలో కూడా..

ABN , First Publish Date - 2023-02-09T19:58:14+05:30 IST

నాన్న-కూతుళ్ల ఆప్యాయత గురించి పెద్దగా చెప్పాల్సిన పనేలేదు. నాన్న తోడుంటే ఏ కూతురైనా చిరునవ్వుతో వెలిగిపోవాల్సిందే. అది ఎంతటి కష్టకాలమైనా సరేనని నిరూపించే ఓ ఘటన ప్రకృతి ప్రకోపంతో టర్కీతోపాటు విలవిల్లాడుతున్న సిరియాలో వెలుగుచూసింది...

Turkey Syria earthquake: కన్నప్రేమంటే ఇదేనేమో.. నాన్నను చూడగానే అంత బాధలో కూడా..

అలెప్పో: నవమాసాలు మోసేది అమ్మ అయితే.. పుట్టిన తర్వాత గుండెలపై మోసేవాడే నాన్న (Father love).. కళ్ల ముందు నాన్న ఉండాలేగానీ కొండంత ధైర్యం వచ్చేస్తుంది. సరదా ఆటలు ఆడించి, పాటలు పాడి భుజాలపై నిద్రపుచ్చే నాన్నకు పసిమనసుల్లో గొప్ప స్థానం ఉంటుంది. కన్నపేగు ముఖాల్లో చిరునవ్వు కోసం జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకునే నాన్న కనిపిస్తే పిల్లల్లో సంతోషం నిండిపోతుంది. ఇక నాన్న-కూతుళ్ల ఆప్యాయత గురించి పెద్దగా చెప్పాల్సిన పనేలేదు. నాన్న తోడుంటే ఏ కూతురైనా చిరునవ్వుతో వెలిగిపోవాల్సిందే. అది ఎంతటి కష్టకాలమైనా సరేనని నిరూపించే ఓ ఘటన ప్రకృతి ప్రకోపంతో తుర్కియేతోపాటు విలవిల్లాడుతున్న సిరియాలో (2023 Turkey–Syria earthquakes) వెలుగుచూసింది. ప్రతిఒక్కరి హృదయాలను హత్తుకుంటున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Untitled-5.jpg

సిరియాలోని (Kahramanmaras earthquake) అలెప్పోకు ఉత్తరాన ఉన్న జిండేరిస్ పట్టణంలో తీవ్రస్థాయి భూకంపం తాకిడికి ఓ ఇల్లు పేకమేడలా కూలిపోయింది. ఆ ఇంటి శిథిలాల కింద నౌర్ (Nour) అనే ఓ చిన్నారి చిక్కుకుంది. కనీసం ఏం జరిగిందో కూడా తెలియని ఆ పసిహృదయం శిథిలాల కిందే కొన్ని గంటలపాటు గడపాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతోనే ఉన్న చిన్నారి నౌర్ ఆచూకీ లభ్యమవ్వడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. రెస్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి. అయితే చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు వైట్ హెల్మెట్స్‌గా పిలిచే సిరియన్ సివిల్ డిఫెన్స్‌‌ వాలంటీర్స్ శ్రమిస్తున్న సమయంలో ఏం జరుగుతుందో తెలియని బాలిక ఆందోళనకు గురయ్యింది. కంగారుపడిపోయింది.

Untitled-4.jpg

భయపడొద్దంటూ వాలంటీర్స్‌కు తనకు చెప్పారు. అయినప్పటికీ తనలో బెరుకుపోలేదు. దీంతో నాన్న వైపే చూస్తూ ఉండమంటూ వాలంటీర్లు బాలికకు సూచించడం చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. ముఖమంతా దుమ్ముధూళితో నిండిపోయిన కూతురి ముఖంవైపు చూస్తూ తండ్రి ఉద్వేగానికి గురవ్వగా... నాన్న వైపు చూస్తూ ఆ చిన్నారి ధైర్యం తెచ్చుకుంది. నవ్వుతో వెలిగిపోయింది. తల భాగం మాత్రమే పైకి మిగిలి.. మిగతా శరీరమంతా శిథిలాల్లో చిక్కుకున్నప్పటికీ తండ్రిని చూసి ధైర్యం తెచ్చుకుంది. దీంతో కొద్దిసేపటికి వాలంటీర్లు చిన్నారి సురక్షితంగా బయటకు తీశారు. నాన్న చేతుల్లో పెట్టడంతో ఆమె భుజాలపై వాలిపోయింది. ఆ తర్వాత చికిత్స కోసం చిన్నారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. తండ్రి-కూతుళ్ల మధ్య అప్యాయతను తెలియజేసేందుకు ఇంతకుమించి ఇంకేం చెప్పగలమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-09T20:03:17+05:30 IST