Tragic Incident: చేపలు తినింది.. నాలుగు అవయవాలు కోల్పోయింది.. ఇందుకు కారణం ఇదే!

ABN , First Publish Date - 2023-09-17T20:55:17+05:30 IST

సాధారణంగా.. చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తుంటారు. చేపల్లో మానవ శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయని, వారానికి రెండుసార్లు చేపలు తింటే గుండె ఆరోగ్యంగా..

Tragic Incident: చేపలు తినింది.. నాలుగు అవయవాలు కోల్పోయింది.. ఇందుకు కారణం ఇదే!

సాధారణంగా.. చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తుంటారు. చేపల్లో మానవ శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయని, వారానికి రెండుసార్లు చేపలు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని కొన్ని పరిశోధనలు కూడా తేల్చాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డీ, విటమిన్ బీ2లతో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మరెన్నో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇన్ని పోషకాలుండే చేపల్ని తినడం వల్ల.. ఒక మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అంతేకాకుండా.. తన శరీరంలో నాలుగు అవయవాలను కూడా కోల్పోయింది. పదండి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివాసం ఉండే లారా బెరాజస్ (40 ఏళ్లు) కొన్ని రోజుల క్రితం స్థానిక మార్కెట్ నుంచి టిలాపియా చేపలను కొనుగోలు చేసింది. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తానే చేపల కూర వండి, ఎంతో ఇష్టంగా తినింది. కానీ.. ఆ చేపలు తిన్న వెంటనే బెరాజస్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక్కసారిగా ఆమె కుప్పకూలింది. దీంతో.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రికే పరిమితం అయ్యింది. ఆమె శరీరంలో నాలుగు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రహించి.. వైద్యులు సర్జరీ చేసి, వాటిని తొలగించారు. ఈ పరిస్థితికి గల కారణాలేంటని వైద్యులు పరిశీలించగా.. అప్పుడు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. టిలాపియా చేపలను తినడం వల్లే ఆమె ఆరోగ్యం ఇంతలా క్షీణించిందని వైద్యులు గుర్తించారు.


నిజానికి.. ఆ చేపలేమీ ప్రమాదకరమైనవి కావు. కాకపోతే.. ఆ చేపల్లో ప్రాణాంతకమైన జాతికి చెందిన బ్యాక్టీరియాలు ఉన్నాయని తేలింది. ఆ బ్యాక్టీరియాతో కలుషితమైన చేపల్ని తినడం వల్లే ఆమెకు ఈ దుస్థితి పట్టింది. ఆమె చేపల్ని సరిగ్గా కడకుండా, ఉడకబెట్టకుండా.. కూర వండేసి తినేసింది. దాంతో.. ఆమెకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకింది. బెరాజస్ దాదాపు చావు అంచులదాకా వెళ్లి వచ్చిందని, ప్రస్తుతం ఆమె రెస్పిరేటర్‌లో ఉందని.. ఆమె స్నేహితురాలు మెసినా తెలిపింది. ఆమె వేళ్లు, పాదాలు, దిగువ పెదవి అన్నీ నల్లగా మారాయని.. ఆమె మూత్రపిండాలు కూడా విఫలమయ్యాయని చెప్పింది. అయితే.. డాక్టర్లు వైద్యపరంగా ఆమెను కోమాలోకి పంపించి, చికిత్స చేశారని మెసినా చెప్పింది. బెరాజస్‌కు విబ్రియో వల్నిఫికస్‌ సంక్రమించిందని పేర్కొంది.

కాగా.. విబ్రియో వల్నిఫికస్‌ అనే ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సముద్రపు నీళ్లు, రా సీఫుడ్స్‌లలో ఉంటుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే.. సీఫుడ్స్‌ని శుభ్రం చేసి, బాగా ఉడకబెట్టి తినాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అప్పుడు బెరాజస్ తరహాలోనే ఆసుపత్రిపాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి.. సీఫుడ్స్‌ని వడ్డించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యమైనా పర్లేదు కానీ.. బాగా ఉడకబెట్టి తింటేనే శ్రేయస్కరం.

Updated Date - 2023-09-17T20:55:17+05:30 IST