Unclaimed Deposits: బ్యాంకులోని ఆ సొమ్మును రాబట్టేదెలా?

ABN , First Publish Date - 2023-04-04T20:03:12+05:30 IST

దేశంలోని బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేసుకోని(Unclaimed Deposits) సొమ్ము కోట్ల కొద్దీ

Unclaimed Deposits: బ్యాంకులోని ఆ సొమ్మును రాబట్టేదెలా?

న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేసుకోని(Unclaimed Deposits) సొమ్ము కోట్ల కొద్దీ మూలుగుతోంది. డిసెంబరు 2016 నాటికి 2.5 కోట్ల బ్యాంకు ఖాతాల్లో రూ. 8,800 కోట్లకుపైగా డబ్బు అలానే పడింది. ఈ సొమ్ముపై దృష్టి సారించిన భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) ఈ సమస్య పరిష్కరానికి నడుం బిగించింది. ఇందులో భాగంగా కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటి ద్వారా తమ ఖాతాల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి పొందొచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులు ఈ నిబంధనలను పాటించడం ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునే ప్రక్రియకు ఆటంకం లేకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది.

అసలేంటీ అన్‌ క్లెయిమ్డ్ డిపాజిట్లు?

పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఆదాయం, మెచ్యూరిటీ మొత్తాన్ని అన్‌ క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పేర్కొంటారు. ఇంకా చెప్పాలంటే, టర్మ్ డిపాజిట్లు పదేళ్ల కంటే ఎక్కువ ఇనాక్టివ్‌గా ఉంటే వాటిని క్లెయిమ్ చేయనవిగా పరిగణిస్తారు. ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుంది.

అన్ క్లెయిమ్ అయితే ఏం చెయ్యాలి?

ఖాతాలు కానీ, డిపాజిట్లు కానీ అన్‌క్లెయిమ్ జాబితాలోకి చేరితే, అంటే పదేళ్లుగా క్రియారహితంగా ఉంటే అవి బ్యాంకు హెడాఫీసుకు బదిలీ అవుతాయి. లేదంటే, టర్మ్ డిపాజిట్లు మెచ్యూర్ అయి, ఆదాయం చెల్లించకుంటే బ్యాంకు వద్ద మిగిలిపోయిన మొత్తం పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీ రేటు లేదంటే మెచ్యూరిటీ అయిన టీడీపై కాంట్రాక్ట్ వడ్డీ రేటులో ఏది తక్కువైతే అది వస్తుంది.

ఈ నిధులను డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేయొచ్చు. ఇందులో ప్రధానంగా రెండు ఖాతాలు ఉంటాయి. అందులో ఒకటి క్రియారహిత టర్మ్ డిపాజిట్లు కాగా రెండోది పదేళ్లుగా ఆపరేట్ చేయని, లేదంటే క్లెయిమ్ చేయని ఖాతాలు ఉంటాయి. బ్యాంకులు ప్రతి క్యాలెండర్ నెలలో ఈ ఇనాక్టివ్ ఖాతాల నుంచి బ్యాలెన్సులను నిధికి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలోనూ క్లెయిమ్ చేయని నిధులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా బ్యాంకులన్నీ తమ వెబ్‌సైట్లలో ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్, టర్మ్ డిపాజిట్ల వివరాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే, ఈ జాబితాలో ఖాతాదారుల పేర్లు, చిరునామా మాత్రమే ఉండాలి. కొన్ని బ్యాంకులు పాన్‌కార్డ్, పుట్టిన రోజు, పేరు, టెలిఫోన్ నంబరు తదితర వాటి ద్వారా సెర్చ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి.

అన్‌క్లైమ్డ్ డిపాజిట్లను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

వినియోదారులు తొలుత తమ దగ్గరలో ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించాలి. అక్కడ అన్‌క్లైమ్డ్ డిపాజిట్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో కూడా నాలుగు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి వ్యక్తిగతమైనది(యజమాని) కాగా, రెండోది నామినీ, మూడోది చట్టబద్ధమైన వారసుడు, నాలుగోది ఇతర కారణం ఉంటాయి. ఈ నాలుగింటిలో మనం దేనికి చెందుతామో చూసి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మన క్లెయిమ్‌ను నిరూపించే ఒరిజినల్ పత్రాలు, గుర్తింపు, చిరునామా ఆధారాలు తప్పనిసరి. ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బ్యాంకు ఆ క్లెయిములను పరిష్కరిస్తుంది. సమర్పించిన పత్రాలు సరైనవిగా బ్యాంకు భావిస్తే ఆ ఖాతాలు/ డిపాజిట్ మళ్లీ యాక్టివ్ అవుతాయి.

Updated Date - 2023-04-04T20:03:12+05:30 IST