South Korea People Age: ప్రపంచంలోనే అరుదైన వింత.. ఒక్కసారిగా రెండేళ్లు తగ్గిన 5 కోట్ల దక్షిణ కొరియా ప్రజల వయసు..!
ABN , First Publish Date - 2023-06-28T18:11:23+05:30 IST
మీ వయసు ఎంత అని అడిగితే ఏం చెబుతారు? ఏముంది.. ఏ తేదీన అయితే పుట్టారో ఆ రోజు నుంచి మొదలు పెట్టి ఆపై ఏడాది అదే తేదీకి ఏడాది పూర్తయినట్టు లెక్కిస్తారు. అలా పుట్టిన రోజుల ఆధారంగా వయసు చెబుతారు. ప్రపంచంలో అన్ని దేశాల వారూ ఇలాగే తమ వయసును లెక్కించుకుంటారు. అయితే కొరియా వాసులు మాత్రం అలా కాదు.
మీ వయసు (Age) ఎంత అని అడిగితే ఏం చెబుతారు? ఏముంది.. ఏ తేదీన అయితే పుట్టారో ఆ రోజు నుంచి మొదలు పెట్టి ఆపై ఏడాది అదే తేదీకి ఏడాది పూర్తయినట్టు లెక్కిస్తారు. అలా పుట్టిన రోజుల ఆధారంగా వయసు చెబుతారు. ప్రపంచంలో అన్ని దేశాల వారూ ఇలాగే తమ వయసును లెక్కించుకుంటారు. అయితే దక్షిణ కొరియా (South Korea) వాసులు మాత్రం అలా కాదు. అక్కడ మూడు విధాలుగా వయసును లెక్కిస్తారు. అంతర్జాతీయ విధానం, కొరియన్ వయసు (Korean age), క్యాలెండర్ వయసు.. ఇలా ఒక్కో వ్యక్తి మూడు రకాల వయసులను చెబుతుంటారు. ఈ గందరగోళానికి తెరదించాలని కొరియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ రోజు (బుధవారం) నుంచి అంతర్జాతీయ విధానాన్ని (International Age) అనసరించాలని నిర్ణయించుకుంది.
అంతర్జాతీయ విధానం ప్రకారం.. బిడ్డ పుట్టినపుడు అతడి వయసును ``సున్నా``గా భావిస్తారు. ఆ తర్వాత వచ్చే ఏడాది అదే తేదీ నాటికి ఒక ఏడాది పూర్తయినట్టు లెక్కిస్తారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇదే విధానంలో వయసును లెక్కిస్తాయి. అయితే కొరియన్ విధానంలో మాత్రం బిడ్డ పుట్టగానే ఒక ఏడాది వయసుగా లెక్కిస్తారు. ఆ తర్వాత ప్రతి ఏడాది జనవరి 1న అతడి వయసుకు ఒక్కో ఏడాది జోడిస్తారు. ఉదాహరణకు 2022, డిసెంబర్ 25న పుట్టిన శిశువుకు 2023 జనవరి1 నాటికి రెండేళ్లు పూర్తయిపోతాయన్నమాట.
ఈ రెండు కాకుండా క్యాలెండర్ విధానంలో కూడా వయసు లెక్కిస్తారు. దీని ప్రకారం.. బిడ్డ పుట్టినపుడు అతడి వయసును ``సున్నా``గానే భావిస్తారు. ప్రతి ఏడాది జనవరి 1న అతడి వయసుకు ఒక్కో ఏడాది జోడిస్తారు. అంటే సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా అతడి జీవితంలో తొలి జనవరి 1న అతడికి ఏడాది వయసు వచ్చినట్టు లెక్క. ఇలా మూడు విధాలుగా వయసును లెక్కిస్తుండడంతో అక్కడ గందరగోళం నెలకొంది.
Viral Video: ఎంత పనిచేశావయ్యా.. బోటులో వెళ్తూ చేపల్ని పట్టుకుందామని చేతుల్ని నీళ్లలోకి పెట్టాడు.. మరుక్షణంలోనే..!
పౌరులు ఒక్కో సమయంలో ఒక్కో వయసును చెబుతుండడం పలు వివాదాలకు కారణమవుతోంది. ఈ గందరగోళానికి తెరదించేందుకు దక్షిణా కొరియా ప్రభుత్వం సన్నద్ధమైంది. జూన్ 28 నుంచి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే వయసును లెక్కించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి మూడో వంతు పౌరుల నుంచి మద్దతు లభించినట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొరియా పౌరుల వయసు ఏడాది లేదా రెండేళ్ల వరకు తగ్గనుంది.