Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన ఘటన.. నైటీ డ్రెస్‌లో వెళ్లి రాత్రి సమయంలో..

ABN , First Publish Date - 2023-06-02T20:23:32+05:30 IST

నైటీ డ్రెస్‌లో వచ్చి రాత్రి సమయంలో షట్టర్‌ తాళాలు పగులగొట్టి ఖరీదైన సెల్‌పోన్లను చోరీ చేసిన నిందితుడిని మహంకాళీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన ఘటన.. నైటీ డ్రెస్‌లో వెళ్లి రాత్రి సమయంలో..

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): నైటీ డ్రెస్‌లో వచ్చి రాత్రి సమయంలో షట్టర్‌ తాళాలు పగులగొట్టి ఖరీదైన సెల్‌పోన్లను చోరీ చేసిన నిందితుడిని మహంకాళీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మహంకాళీ ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ బి.రమేశ్‌ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్పూర్‌ మడిపల్లెకు చెందిన మంకాల వినయ్‌ (28) అలియాస్‌ యాకయ్య తండ్రి చనిపోవడంతో బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి తల్లితో ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితం కంటోన్మెంట్‌ తాడ్‌బండ్‌ బాపూజీనగర్‌లో నివాసముంటూ ఎస్‌డీ రోడ్డులోని ఎమరాల్డ్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

ప్లాన్‌ ప్రకారమే..

గతంలో వినయ్‌ అనే వ్యక్తి రియల్‌ మీతోపాటు మరో సెల్‌ఫోన్‌ స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఇప్పుడు పనిచేస్తున్న ఎమరాల్డ్‌ హౌజ్‌ మెదటి అంతస్థులోనే ఆ స్టోర్‌ ఉంది. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చోరీకి పథకం వేశాడు. మే 24న నుంచి 26 వరకు పరిసరాలను రెక్కీ నిర్వహించాడు. ప్లాన్‌ ప్రకారం తనపై అనుమానం రాకుండా ఉండేందుకు వినయ్‌ సెలవు పెట్టి బయటికి వెళ్లిపోయాడు. ఈనెల 28న రాత్రి 12.30 గంటలకు సోదరి నైట్‌ ధరించి సెల్‌ఫోన్‌ స్టోర్‌కి వచ్చాడు. స్టోర్‌ తాళాలు పగులగొట్టి ఖరీదైన 37 సెల్‌ఫోన్లను ఎత్తుకొని సొంతూరుకు వెళ్లాడు.

ఇలా దొరికాడు..

ఈనెల 29న (సోమవారం) ఉదయం మొబైల్‌ స్టోర్‌లో చోరీ జరిగినట్లుగా దుకాణం యజమాని మహ్మద్‌ యూసుఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న సెక్యూరిటీ గార్డులను పూర్తి స్థాయిలో విచారించారు. దుకాణంలో పనిచేస్తున్న వినయ్‌ సెలవుపై వెళ్లడం పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో దర్యాప్తు ప్రాంభించగా నిందితుడిని ఎట్టకేలకు పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

Updated Date - 2023-06-02T20:24:12+05:30 IST