Elizabeth Taylor : ఏడు పెళ్ళిళ్ళు.. ఇరవై సర్జరీలు.. ఎలిజిబెత్ టేలర్ జీవితంలో ఎన్ని మలుపులో..!

ABN , First Publish Date - 2023-02-27T16:11:05+05:30 IST

అందగత్తెల జీవితాలు అంత సాఫీగా సాగిపోయిన దాఖలాలైతే తక్కువే..

Elizabeth Taylor : ఏడు పెళ్ళిళ్ళు.. ఇరవై సర్జరీలు.. ఎలిజిబెత్ టేలర్ జీవితంలో ఎన్ని మలుపులో..!
Elizabeth Taylor

అందమైన ముఖం, అంతకన్నా సొగసైన నటన ఇవన్నీ ఇప్పటి తరలకు సొంతమే అయినా అందానికి సరైన అర్థం చెప్పిన తారామణులు పాత కాలం వారిలో ఎందరో ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా, చూడగానే గుర్తుంచుకునే తారలైతే కొందరే, మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా ఎంతో పెద్దదే. ఈరోజు ఎలిజబెత్ టేలర్ పుట్టిన రోజు. హాలీ‌వుడ్‌ని శాసించిన అందగత్తె.. ఒకప్పటి టాప్ హీరోయిన్..

ఈ అందగత్తె తన అద్భుతమైన నటనతోనే కాదు, చక్కని నటతోనూ హాలీవుడ్ తెరమీద కెరీర్ మొదలు పెట్టింది. అయితే జీవితం అంత తేలికగా సాగిపోలేదు.. ఆ అందం చుట్టూ బోలెడు చిక్కులు, అనారోగ్యాలు, శరీరం నిండా సర్జరీలు, అయినా ఆ అందం ఎక్కడా ఓడిపోలేదు. నటనలోనూ తన ప్రత్యేకతను చాటింది. అందగత్తెల జీవితాలు అంత సాఫీగా సాగిపోయిన దాఖలాలైతే మనకు తక్కువే.. అందులోనూ సినీ ప్రపంచంలో అది ఏ హుడ్ అయినా సరే.. నల్లేరు మీద నడకే.. ఎంత అందంగా ఉంటే అంత లావు కష్టాలు తప్పవు. అందానికి హాలీవుడ్‌లో టక్కున గుర్తుకువచ్చే నటి ఎలిజబెత్ రోజ్ మండ్ టేలర్. ఆమె జీవితాన్ని అద్భుతమైన అందమైన ముఖం మాత్రమే నడిపేసింది. ఆ అందం అయస్కాంతంలా ప్రపంచాన్ని ఆకర్షించింది.

WhatsApp Image 2023-02-27 at 2.32.05 PM.jpeg

ఎలిజబెత్ అందం రెండు పదులు దాటక మునుపే నటిగా తెరకు పరిచయం అయింది. నిజం చెప్పాలంటే ఎలిజబెత్ పుట్టుకతోనే నటి. చక్కని హావభావాలు, నటనా కౌశలం ఆమె సొంతం. కెరీర్ మొదట్లోనే 'నేషనల్ వెల్వెట్' అనే సినిమాతో హిట్ కొట్టింది. స్టార్ గా నిలబడింది. ఇక పేరు, స్టార్ డమ్ వచ్చేసాకా జర్నలిస్ట్ లంతా ఎలిజబెత్‌ను 'హాలీవుడ్ విలువైన ఆభరణం'గా పిలిచేవారు. ఒక సన్నివేశాన్ని ఒకే షాట్‌లో 'ఓకే' చేసేసేదట ఎలిజబెత్.. ఆ నైపుణ్యం ఆమెకు పుట్టుకతోనే వచ్చిందనేవారు. అందుకే తోటి నటీనటులు, దర్శకులు ఆమెకు ఇచ్చిన ముద్దు పేరు 'వన్ షాట్ లీజ్' అని పిలిచేవారు. ఆమె కెరీర్ గ్రాఫ్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బాల నటి నుంచి, తారగా అగ్రస్థానానికి చేరుకునే లోపు ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాఫీగా కెరీర్ సాగిపోవడమే. తను నటింటిన చాలా సినిమాలు ఇప్పుడు హాలివుడ్ క్లాసిక్స్‌గా నిలిచాయి.

ఎలిజబెత్ టేలర్ లండన్‌లో అమెరికన్ తల్లిదండ్రులు ఫ్రాన్సిస్ లెన్ టేలర్, సారా సోదర్న్‌లకు జన్మించింది. ఇద్దరూ లండన్‌లో ఆర్ట్ డీలర్లు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఎలిజబెత్‌తో కలిసి అమెరికాకు తిరిగి వచ్చారు.

తొమ్మిదేళ్లకే తన తల్లితో 'దేర్ ఈజ్ వన్ బోర్న్ ఎవ్రీ మినిట్' అనే చిత్రంలో నటించింది. అది 1942లో విడుదలైంది. ఆ తరువాత 1943లో విడుదలైన 'లస్సీ కమ్ హోమ్' అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి వసూళ్ళను రాబట్టింది. తన కెరీయర్‌లో చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూనే సాగింది. నేషనల్ వెల్వెట్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 4 మిలియన్లు వసూలు చేసింది. బర్టన్‌తో ఆమె చేసిన సిమిమాలు 'హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా వుల్ఫ్', 'ది వి.ఐ.పి. ఎస్, ది శాండ్ పైపర్', 'ది టైమింగ్ ఆఫ్ ది ష్రూ', బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్‌లుగా నిలిచాయి. 200 మిలియన్ల కలెక్షన్స్ సాధించాయి. ఎన్నో సత్కారాలను అందుకుంది ఎలిజబెత్, రెండుసార్లు అకాడమీ అవార్డులను, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, బాఫ్టా అవార్డ్, స్కీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులను గెలుచుకుంది.

జీవితంలోని మలుపులు..

ఎలిజబెత్ ఏడుగురు భర్తలతో, ఎనిమిసార్లు జీవిత ప్రయాణాన్ని సాగించింది. తన అందమైన రూపం వెనుక స్థిరంగా లేని మనసుతో ప్రయాణించింది. ఎందరో గొప్ప వ్యక్తులు ఎలిజబెత్ జీవితంలోకి తొంగిచూసి వెళిపోయారు. ప్రముఖ వ్యక్తులతో ప్రేమ వ్యవహారాలైతే ఎలిజబెత్ జీవితంలో లెక్కేలేదు. తన ప్రేమకు చిహ్నంగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో పాటు, ఒక దత్త కుమార్తె కూడా ఉంది.

వైద్య సమస్యలు,.

1950 నుంచి ఎలిజబెత్ తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. 20 పెద్ద ఆపరేషన్లు జరిగాయి, కనీసం 70 సార్లు ఆసుపత్రిలో చేరింది. 2004లో రక్తప్రసరణ సరిగా అందక గుండె జబ్బుతో పోరాడింది. ఐదేళ్ళకు గుండెకు కూడా శస్త చికిత్స జరిగింది. 2011లో గుండెపోటుతో తుది శ్వాస విడిచింది ఎలిజబెత్ టేలర్. అందం, దానితో ఆకర్షణలు ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఓ లెజెండ్ యాక్టర్, ఎంతో ప్రతిభతో సినీ తెరపై గోల్డెన్ లెగ్ మోపింది. ఇప్పటికీ హాలీవుడ్ క్లాసిక్స్ చూస్తున్నప్పుడు ఎలిజబెత్ టేలర్ అందం సగటు ప్రేక్షకుని మతి పోగొడుతూనే ఉందనటంలో అతిశయోక్తిలేదు.

Updated Date - 2023-02-27T16:11:10+05:30 IST