Health Tips: 30,40,50.. ఏ వయసులో ఏ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో తెలుసా? ఈ పరీక్షల వల్ల ఏం జరుగుతుందంటే..

ABN , First Publish Date - 2023-06-05T11:05:07+05:30 IST

ఈ కాలంలో డబ్బును సంపాదించినంత సులువుగా ఆరోగ్యాన్ని సంపాదించలేకపోతున్నారు. కనీసం తృప్తిగా తినలేక బాధపడుతున్నవారు చాలామందే ఉన్నారు. అయితే ఈ పరీక్షల వల్ల

Health Tips:  30,40,50.. ఏ వయసులో ఏ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో తెలుసా? ఈ పరీక్షల వల్ల ఏం జరుగుతుందంటే..

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ కాలంలో డబ్బును సంపాదించినంత సులువుగా ఆరోగ్యాన్ని సంపాదించలేకపోతున్నారు. కనీసం తృప్తిగా తినలేక బాధపడుతున్నవారు చాలామందే ఉన్నారు. అయితే వయసును బట్టి చాపకింద నీరులా ఆరోగ్యసమస్యలు మెల్లిగా చుట్టుముడతాయి. అందుకే 30, 40, 50 ఏళ్ళలో కొన్ని ఆరోగ్య పరీక్షలు(Health tests) చేయించుకోవాలని అంటున్నారు వైద్యులు. ఈ పరీక్షల వల్ల శరీరానికి పొంచి ఉన్న అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. బంగారంలాంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

30ఏళ్ళు నిండినవారికి..(30 years..)

30సంవత్సరాలు నిండాయంటే ఆరోగ్య సమస్యలు మెల్లిగా మొదలవుతున్నాయని అర్థం. 30సంవత్సరాలు నిండిన తరువాత మహిళలు ప్రతి 3సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష(pap smear test) చేయించుకోవాలి. ఈ పరీక్షలో గర్భాశయ ముఖ ద్వారం, దాని చుట్టూ ఉన్నకణాలను చిన్న బ్రష్ తో తొలగిస్తారు. ఈ కణాలను పరీక్షించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్(cervical cancer) గుర్తించవచ్చు. గర్భాశయ క్యాన్సర్ కు దారితీసే హ్యూమన్ పాపిల్లోమా వైరస్(human papillomavirus) ను HPV టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. ఈ పరీక్ష కూడా చాలా ముఖ్యమైనది. ఇక 30 ఏళ్ళు నిండిన స్త్రీ, పురుషులు ప్రీడయాబెటిస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ టెస్ట్ లు చేయించుకోవాలి. అధిక బరువు ఉన్నవారు అయితే ప్రతి ఆరునెలలకు ఒకసారి తప్పనిసరిగా ఈ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవడం వల్ల ఎన్నో జబ్బులనుండి జాగ్రత్త పడే అవకాశం ఉంది. బాడీ మాస్ ఇండెక్స్(Body mass index) ను తప్పనిసరిగా తనిఖీ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది.

40 ఏళ్ళు నిండినవారు.. (40 years..)

మహిళల్లో రొమ్ము క్యాన్సర్స్(Breast cancer) కు గురవుతున్న వారిలో 40ఏళ్ళు దాటినవారే అధికం. ఈ కారణంగా 40ఏళ్ళు దాటిన ప్రతి మహిళ రెండు సంవత్సరాలకు ఒకసారి రొమ్ము క్యాన్సర్ కోసం మామోగ్రామ్ లను(Mammogram) చేయించుకోవాలి. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ ను ముందే గుర్తించవచ్చు ఫలితంగా సరైన చికిత్సకు అవకాశం ఉంటుంది. 45ఏళ్లు దాటిన తరువాత ఈ మామోగ్రామ్ లను సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. 45 ఏళ్ళు దాటిన తరువాత మహిళలు, పురుషులు ఇద్దరూ కొలొరిక్టల్ క్యాన్సర్ టెస్ట్(colorectal) చేయించుకోవాలి. 40ఏళ్లు దాటిన ప్రతి స్త్రీ, పురుషులు కంటి పరీక్షలు(eye test) చేయించుకోవాలి. డయాబెటిస్, హైపర్ టెన్షన్ లు ఉన్నవారిలో కంటి సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఐ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల కంటి శుక్లం(eye cataract), గ్రాకోమాను(Glaucoma) సులువుగా, ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.

50ఏళ్ళు నిండినవారు..(50 years..)

50ఏళ్ళు దాటిన తరువాత మహిళల్లో చాలా ఎక్కువగా ఎదురయ్యే సమస్య బోలు ఎముకల వ్యాధి(osteoporosis). మెనోపాజ్ కారణంగా బుతుచక్రం ఆగిపోయిన మహిళలకు బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎక్కువ. అలాగే 50 నుండి 80 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ, పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్(lung cancer) అవకాశాలు ఎక్కువ. వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోవడం కూడా ఇందుకు కారణమవుతుంది. ధూమపానం(smoking) అలవాటున్న మగవారిలోనూ, గతంలో ధూమపానం చేసి ఆపేసినవారిలోనూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులు ప్రొస్టేట్ క్యన్సర్(prostate cancer) పరీక్షలు కూడా చేయించుకోవాలి

Updated Date - 2023-06-05T11:05:07+05:30 IST