National Science Day 2023: నోబెల్ గెలిచిన రామన్ ఎఫెక్ట్.., భౌతిక శాస్త్రంలో బంగారు పతకాన్ని తెచ్చిందీ ఆయనే..!

ABN , First Publish Date - 2023-02-28T11:02:12+05:30 IST

200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో..

National Science Day 2023: నోబెల్ గెలిచిన రామన్ ఎఫెక్ట్.., భౌతిక శాస్త్రంలో బంగారు పతకాన్ని తెచ్చిందీ ఆయనే..!
Sir CV Raman

భారత భౌతిక శాస్త్రవేత్తగా భారతదేశం గర్వించదగ్గ విద్యావేత్త, సర్. సి.వి రామన్ 1986లో, "రామన్ ఎఫెక్ట్" కనుగొన్నందుకుగాను ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జ్ఞాపకంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం సైన్స్ డేను “గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీంగ్” అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. రామన్ ఎఫెక్ట్ 1930లో భౌతిక శాస్త్రవేత్తగా సర్ సి.వి రామన్ తన నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. కాంతి ప్రవాహం ఒక ద్రవం గుండా వెళుతున్నప్పుడు, ద్రవంతో చెల్లాచెదురుగా ఉన్న కాంతి, కొంత భాగం వేరేదని రామన్ కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణ వెంటనే శాస్త్రీయంగా సంచలనాత్మకంగా మారింది.

చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబరు 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవాడు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (Gold Medal in Physics) పూర్తి చేశాడు.

1907లో ఎం.యస్.సి (Physics)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచాడు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ చెప్పుకొచ్చాడు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశాడు.

ఉద్యోగరిత్యా కలకత్తా బదిలీ అయింది. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్ కు రోజూ వెళ్ళి పరిశోధన చేసేవాడు. రామన్ ఆసక్తి గమనించి కలకత్తా విశ్వవిద్యాలయం ప్రొఫిసర్ అశుతోత్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ, రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బావుంటుందని సూచించారు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు రామన్.

బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు రామన్. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్‌కు వెళ్ళేవాడు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.

ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశాడు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచాడు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం ఎక్స్(X) కిరణాల విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.

అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. తన పరిశోధనను 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.

ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి.

రామన్ లోని పట్టుదల ఓ గొప్ప థియరీని ఆవిష్కరించేలా చేసింది. ఆయన జీవితం ఎందరో శాస్త్రవేత్తలకు ఆదర్శప్రాయం. నేటి యువతకు ఆయన ప్రయోగాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఈ సైన్స్ డే రోజున సర్ సి.వి రామన్ సైన్స్ కి చేసిన సేవలని గుర్తుచేసుకుందాం.

Updated Date - 2023-02-28T11:08:25+05:30 IST