Share News

Doctor: ఈ డాక్టర్ నిజంగా దేవుడే.. ఎమర్జెన్సీగా అవయవ మార్పిడి.. అంబులెన్స్‌లో వస్తోంటే యాక్సిడెంట్..!

ABN , First Publish Date - 2023-11-23T11:34:28+05:30 IST

కొందరు వైద్యులు తమ వృత్తిని దైవంగా భావిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఒక రోగి ప్రాణాన్ని కాపాడటం కోసం ఎంత సాహసమైనా చేస్తారు. ఈయన కూడా అంతే..

Doctor: ఈ డాక్టర్ నిజంగా దేవుడే.. ఎమర్జెన్సీగా అవయవ మార్పిడి.. అంబులెన్స్‌లో వస్తోంటే యాక్సిడెంట్..!

వైద్యులు ప్రత్యక్ష దేవుళ్లు అని అంటారు. నిజంగానే ఎన్నో రోగాల నుండి ప్రజలను బయటపడేయగల సామర్థ్యం వైద్యులకు మాత్రమే ఉంది. వాళ్లే లేకుంటే కోవిడ్ సమయంలో పరిస్థితులు ఊహించని స్థితికి చేరుకుని ఉండేవి. అయితే కొందరు వైద్యులు తమ వృత్తిని దైవంగా భావిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఒక రోగి ప్రాణాన్ని కాపాడటం కోసం ఎంత సాహసమైనా చేస్తారు. డా.సంజీవ్ జాదవ్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. ఆయన అవయవ మార్పిడి చికిత్స కోసం వెళ్తోంటే యాక్సిడెంట్ కు గురయ్యారు. అయినా సరే తన పరిస్థితిని ఏమాత్రం లెక్కచేయకుండా తన వృత్తి ధర్మం కొనసాగించారు. వైద్య వృత్తిమీద గౌరవాన్ని మరింత పెంచిన ఈయన గురించి, ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం పూణెకి చెందిన వైద్యుడు వృత్తి పట్ల తనకున్న నిబద్దతతను చాటుకున్నాడు. డా.సంజీవ్ జాదవ్ ముంబైలోని అపోలో హాస్పిటల్ లో ఊపిరితిత్తులు, గుండె చీఫ్ సర్జన్ గా పనిచేస్తున్నారు. పింప్రిలోని డి.వై పాటిల్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 19ఏళ్ల కుర్రాడి ఊపిరితిత్తులను సేకరించడానికి అక్కడికి చేరుకుని విజయవంతంగా వాటిని సేకరించాడు. అనంతరం చెన్నైలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి వాటిని అమర్చేందుకు బయలుదేరాడు. డి.వై పాటిల్ హాస్పిటల్ నుండి పూణేలోని హెగావ్ విమానాశ్రయం వరకు ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. సేకరించిన ఊపిరితిత్తులను తీసుకుని మరికొంతమంది వైద్యులతో కలసి అంబులెన్స్ లో విమానాశ్రయానికి వెళ్తుండగా మొదట పికప్ వ్యాన్ ను, ఆ తరువాత ఎంఎస్ఆర్టిసి బస్సును అంబులెన్స్ ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా హారిస్ వంతెన గోడను కూడా ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ దెబ్బతినడమే కాకుండా డాక్టర్ జాదవ్ తో పాటు తోటి వైద్యులకు కూడా గాయాలయ్యాయి. కాకపోతే డి.వై పాటిల్ ఆసుపత్రికి చెందిన కారు వీరి అంబులెన్స్ ను వెనుక ఫాలో అయి వస్తుండటంతో వీరి ప్రమాదం గమనించారు.

ఇది కూడా చదవండి: 40 ఏళ్లు దాటినా.. యంగ్‌గా కనిపించేందుకు 7 టిప్స్..!


అంబులెన్స్ చాలా దెబ్బతిని ఉండటంతో డాక్టర్ జాదవ్ తన బృందంతో కలసి డి.వై పాటిల్ ఆసుపత్రికి చెందిన కారు ఎక్కాడు. అక్కడినుండి వారు విమానాశ్రయానికి చేరుకోవడం, చార్టర్ విమానంలో చెన్నైకి చేరడం జరిగిపోయాయి. చెన్నైలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడుతూ కేవలం 72రోజులు మాత్రమే బ్రతికే అవకాశం ఉన్న వ్యక్తికి డాక్టర్ జాదవ్ ఊపిరితిత్తుల మార్పిడి చేశాడు. శస్ర్తచికిత్స సక్సెస్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. శస్త్రచికిత్స తరువాత రోగి వేగంగా కోలుకుంటున్నట్టు తెలిపారు. డాక్టర్ జాదవ్ బృందం తమకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఏమాత్రం లక్ష్యపెట్టకుండా ఒక రోగి ప్రాణాలు నిలబెట్టడంతో ఆయన్ను, ఆయన బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇంటి ముందు తప్పకుండా పెంచాల్సిన 5 మొక్కలివీ..!

Updated Date - 2023-11-23T11:34:30+05:30 IST