Cab Driver: అర్ధరాత్రి క్యాబ్ బుక్ చేసుకున్నాడో వ్యక్తి.. డ్రైవర్‌తో మాట్లాడుతోంటే తెలిసిన షాకింగ్ నిజాలు.. అతడి గురించి ట్విటర్లో పోస్ట్ పెడితే..
ABN , First Publish Date - 2023-03-17T19:56:42+05:30 IST
ప్రయాణాలు చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళతో మాటలు కలుపుతుంటాం. 'ఎక్కడిదాకా వెళ్ళాలి?' అని మొదలయ్యే ఈ మాటల ప్రవాహం మనం దిగాల్సిన స్టాప్ వచ్చేదాకా సాగుతుంది. కొందరు చాలా ఓపెన్ అయిపోయి..
సాధారణంగా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళతో మాటలు కలుపుతుంటాం. 'ఎక్కడిదాకా వెళ్ళాలి?' అని మొదలయ్యే ఈ మాటల ప్రవాహం మనం దిగాల్సిన స్టాప్ వచ్చేదాకా సాగుతుంది. కొందరు చాలా ఓపెన్ అయిపోయి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటారు. ఓ వ్యక్తి తాను అర్థరాత్రి ఎయిర్పోర్ట్ కు వెళుతూ క్యాబ్ డ్రైవర్ ను కదిలించాడు. అతడిని మాటల్లోకి దించాడు. అతని మాటల్లో చాలా షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. తను నిజమే వింటున్నానా? అనే సందేహం కూడా కలిగింది ఆ వ్యక్తికి. బెంగుళూరు నగరంలో జీవితపోరాటం సాగిస్తున్న ఈ క్యాబ్ డ్రైవర్ గురించి, అతని గురించి వైరల్ అవుతున్న ట్వీట్ గురించి వివరంగా తెలుసుకుంటే..
ఉదయాన్నే లేవడం రెడీ అవ్వడం, ఉద్యోగానికి పరుగులు పెట్టడం అందరికీ కామన్. మొదట్లో ఇది బానే అనిపించినా రానురాను చాలామందికి అదంతా బోర్ కొట్టేస్తుంది. తాము చేసే పనిని ప్రేమించేవారు బహుశా తక్కువగానే ఉంటారు. కేవలం సంపాదన కోసం ఉద్యోగం చెయ్యాలని అనుకుంటారు ఎక్కువమంది. బెంగుళూరులో క్యాబ్ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్న ఓ క్యాబ్ డ్రైవర్ మాత్రం ఇందుకు విభిన్నం. సుమిత్ అనే వ్యక్తి అర్థరాత్రి(Midnight) సమయంలో ఎయిర్పోర్ట్(Airport) కు వెళ్ళడానికి @peakbengaluru అనే నేమ్ తో ఉన్న క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ సుమిత్ ను పికప్ చేసుకుని వెళుతుండగా దారిలో సుమిత్ క్యాబ్ డ్రైవర్ ను మాటల్లోకి దించాడు. 'నువ్వెందుకు ఇంత రాత్రి సమయంలో పనిచేస్తున్నావు?' అని సుమిత్ క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించాడు. అప్పుడు క్యాబ్ డ్రైవర్ సుమిత్ దగ్గర ఓపెన్ అయ్యి గతంలో జరిగిన ఓ సంఘటన చెప్పాడు.
అందరిలాగే @peakbengaluru క్యాబ్ డ్రైవర్ కూడా పగటి సమయం అంతా పనిచేసి రాత్రవ్వగానే ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు రాత్రి సమయంలో ఇతను ఇంటికి వెళుతుండగా ఇతనికి ఓ బుకింగ్ వచ్చింది. అయితే ఇతనున్న లొకేషన్ కు బుకింగ్ చేసుకున్న లొకేషన్ చాలా దూరం ఉండటంతో ఆ రైడ్ క్యాన్సెల్ చేశాడు. కానీ బుకింగ్ చేసుకున్నవారు పదే పదే కాల్ చేసి అతన్ని చాలా సార్లు బతిమాలారు. దీంతో ఇక తప్పదనుకుని క్యాబ్ డ్రైవర్ బుకింగ్ లొకేషన్ కు చేరుకున్నాడు. అక్కడకెళ్ళి చూడగా పాపం నెలలు నిండి ప్రసవం కోసం అవస్థలు పడుతున్న గర్భవతి, ఆమె కోసం ఎంతో బాధపడుతున్న కుటుంబం కనిపించింది. వారిని చూసి క్యాబ్ డ్రైవర్ చలించిపోయాడు. వెంటనే వారిని హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. అయితే వారువెళ్ళిన హాస్పిటల్లో డాక్టర్ లేకపోవడంతో వారికేమి చెయ్యాలో తోచలేదు. దీంతో క్యాబ్ డ్రైవర్ వారిని వేరే హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. అక్కడ కూడా డాక్టర్ లేకపోవడం, మళ్ళీ వేరే హాస్పిటల్ కు తీసుకెళ్ళడం ఇలా పలుమార్లు రిపీట్ అయ్యింది. చివరికి ఒక హాస్పిటల్ లో డాక్టర్ ఉండటం, సదరు మహిళకు డెలివరీ చేయడం జరిగింది.
ఈ ఒక్క సంఘటనతో ఆ క్యాబ్ డ్రైవర్ మైండ్ సెట్ మారిపోయింది. రాత్రుళ్ళు ఇలా అత్యవసర సేవలకోసం ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడతారో అని అతను అనుకున్నాడు. దీంతో రాత్రిళ్ళు కూడా క్యాబ్ నడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం మొత్తం సుమిత్ తో పంచుకున్నాడు. Sumitm.lens అనే ట్విట్టర్ అకౌంట్ నుండి సుమిత్ ఈ విషయాన్ని షేర్ చేశాడు. క్యాబ్ డ్రైవర్ చెప్పిన స్పూర్తిదాయకమైన అనుభవం నా ఆలోచనలను ఎంతగానో మార్చేసింది. 'ఈ క్యాబ్ డ్రైవర్ కేవలం తను డ్రైవింగ్ చేసి సంపాదించడమే కాదు మరొకరికి సహాయం చేయడం కోసం పనిచేస్తున్నాడు' అని సుమిత్ పేర్కొన్నాడు. ట్విట్టర్ లో ఈ పోస్ట్ చూసిన కొందరు క్యాబ్ డ్రైవర్ అనుభవం, అతని నిర్ణయం చాలా స్పూర్తిదాయకంగా ఉన్నాయని అంటున్నారు.