నేను అత్తారింటికి వెళ్ళనని కార్లోంచి దిగిపోయిన నవవధువు.. వరుడికి ఆ సమస్య ఉందని అర్థమవడం వల్లే..

ABN , First Publish Date - 2023-03-13T12:16:18+05:30 IST

అమ్మాయిని అత్తారింటికి సాగనంపడానికి కారు ఎక్కించగానే నిజం బయటపడింది.

నేను అత్తారింటికి వెళ్ళనని కార్లోంచి దిగిపోయిన నవవధువు.. వరుడికి ఆ సమస్య ఉందని అర్థమవడం వల్లే..

ఆ అమ్మాయికి తండ్రి లేడు. తోడబుట్టినవాళ్ళు ఆమె బాద్యత తీసుకున్నారు. అప్పుచేసి మరీ అమ్మాయి పెళ్ళి జరిపించారు. అంతా సవ్యంగా జరిగిపోయిందని అందరూ సంతోషించారు.. అమ్మాయిని అత్తారింటికి సాగనంపడానికి కారు ఎక్కించగానే నిజం బయటపడింది. పెళ్ళికొడుకుకు ఉన్న జబ్బును దాచిపెట్టి మరీ అబ్బాయి తరపు బంధువులు పెళ్ళిచేశారని అర్థం అయింది. నేను అత్తారింటికి వెళ్ళనని అమ్మాయి కారుదిగి వెళ్ళిపోయింది. అబ్బాయి తరపు బంధువులు కల్లబొల్లి కబుర్లు చెబుతుంటే నేరుగా పోలీసులనే ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్ళిలో మోసపోయిన ఓ అమ్మాయికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ఝాన్సీ(Jhansi)లో కొత్వాలి(Kotwali) టౌన్ ఉంది. ఈ టౌన్ పరిధిలో దీపక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి ఆర్తి అనే చెల్లెలు ఉంది. దీపక్ తండ్రి చనిపోవడంతో చెల్లెలి బాధ్యత తనే తీసుకున్నాడు. ఝాన్సీలోనే ప్రేమనగర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తితో ఆర్తి పెళ్ళి కుదిర్చారు. రెండునెలల క్రితం వీరిద్దరి నిశ్చితార్థం(Engagement) జరిగింది. నిశ్చితార్థంలో అబ్బాయి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అతను ఇంట్రోవెర్ట్(Introvert) ఏమో అని అందరూ అనుకున్నారు.ఈ కాలంలో నిశ్చితార్థం తరువాత కాబోయే జంట ఫోన్ లో మాట్లాడుకోవడం సహజం.కానీ అతను ఎప్పుడూ అమ్మాయికి ఫోన్ చేయలేదు. అమ్మాయి అన్నయ్య తనకు కాబోయే బావతో మాట్లాడటానికి అతని పోన్ నెంబర్ ఇవ్వమని అబ్బాయి తల్లిదండ్రులను అడిగాడు. 'మా అబ్బాయి ఫోన్ వాడడు..' అని సమాధానం ఇచ్చారు వాళ్ళు. వీళ్ళేదో కాస్త వింతగా ఉన్నారని అనిపించినా అమ్మాయి తరపు వారు సర్దుకుపోయారు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసి ఏలోటూ రాకుండా పెళ్ళి జరిపించారు.

పెళ్ళి అయిపోయాక అప్పగింతలు మొదలయ్యాయి. అమ్మాయిని అబ్బాయితో అత్తారింటికి పంపడానికి కారు ఎక్కించారు. ఆమె ఎక్కిన తరువాత అబ్బాయి కారు ఎక్కబోతుండగా ఒక్కసారిగా అతను కింద పడిపోయాడు. కాళ్ళు చేతులు నేలమీద రాపాడించడం, నాలుక కొరుక్కోవడం, బట్టలు చింపుకోవడం చేశాడు. అది చూసి అందరూ షాకయ్యారు. అబ్బాయి తల్లిదండ్రులు వెంటనే కాళ్ళలో ఉన్న చెప్పులు తీసి వాసన చూపించడంతో మెల్లిగా తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. కానీ అమ్మాయికి మాత్రం అతనికి మూర్చ వ్యాధి ఉందనే విషయం అర్థమైంది. ఇతనితో నేను జీవించలేను అని కారు దిగడానికి ప్రయత్నించింది. కానీ అక్కడున్న కుర్రాళ్ళు అమ్మాయిని కారు దిగనివ్వలేదు. చాలాసేపటి వాదన తరువాత అమ్మాయి కారు దిగింది. అమ్మాయి అత్తారింటికి వెళ్ళడానికి నిరాకరించడంతో అబ్బాయి తరపు బంధువులు ఆమెను అత్తారింటికి పంపాలని డిమాండ్ చేస్తూ గుంపుగా గొడవకు దిగారు. వారందరినీ తప్పుకుని అమ్మాయితోపాటు ఆమె అన్నలు కూడా పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయి పెళ్ళి ముహూర్తాల కారణంగా మూడురోజుల నుండి నిద్రపోలేదు అందుకే తలతిరిగి పడిపోయాడని చెప్పారు. అతనికి ఎలాంటి మూర్చరోగం లేదు అని సమర్థించుకున్నారు. ఈ విషయం పోలీసులే తేల్చాలని అమ్మాయి అన్నయ్య డిమాండ్ చేశాడు. తాము పెళ్ళికి ఎంతో ఖర్చుచేశామని ఆ మొత్తం తిరిగి ఇవ్వాల్సిందేనని అమ్మాయి తెగేసి చెప్పింది. అతనికున్న సమస్య తనకు అర్థమైందని, అబ్బాయి తరపు వారు ఎంత కవరింగ్ చేసుకున్నా తను నమ్మే ప్రసక్తి లేదని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తితో జీవితాంతం ఎలా బ్రతకాలి? అబద్దం చెప్పి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు, వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకునేవరకు వదలనని చెప్పింది. పోలీసులు అమ్మాయి కుటుంబం చేసిన మేరకు విచారణ చేస్తున్నారు.

Updated Date - 2023-03-13T12:16:18+05:30 IST