TSPSC Paper Leak : టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక నిందితురాలు రేణుక ఎవరు.. ప్రవీణ్‌తో పరిచయం ఎలా.. పెద్ద కథే ఉందిగా..!

ABN , First Publish Date - 2023-03-16T11:18:28+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీఎస్‌‌పీఎస్సీ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ (TSPSC Paper Leak) ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్‌ రేణుక (Renuka Rathod) గురించి..

TSPSC Paper Leak : టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక నిందితురాలు రేణుక ఎవరు.. ప్రవీణ్‌తో పరిచయం ఎలా.. పెద్ద కథే ఉందిగా..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీఎస్‌‌పీఎస్సీ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ (TSPSC Paper Leak) ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్‌ రేణుక (Renuka Rathod) గురించి ఆరా తీసే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తల్లి లక్ష్మీభాయి మన్సూర్‌పల్లి బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ కావడంతో కలిసొచ్చిన రాజకీయ బలం, గురుకుల ఉపాధ్యాయురాలిగా తనకు, టెక్నికల్‌ అసిస్టెంట్‌గా తన భర్త ఢాక్యానాయక్‌కు ఉన్నతస్థాయి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆమె లీకేజీకి పూనుకున్నట్లు చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా గంఢీడ్‌ మండలానికి చెందిన రేణుక వనపర్తి ఎస్సీ గురుకుల విద్యాలయంలో హిందీ పండిట్‌గా, ఆమె భర్త వికారాబాద్‌ జిల్లా పరిగిలోని డీఆర్‌డీఏలో పనిచేస్తున్నారు. రేణుక తన సోదరుడు రాజేశ్‌నాయక్‌తో పాటు మన్సూర్‌పల్లి తండాకే చెందిన నీలేశ్‌, శ్రీను, వికారాబాద్‌ జిల్లా లగిచర్లకు చెందిన గోపాల్‌కు కూడా ప్రశ్నపత్రం ఇప్పిస్తానని చెప్పింది. ప్రశ్నపత్రం కోసం భర్త సహకారంతో టీఎస్‌‌పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్‌ను (Praveen) సంప్రదించినట్లు చెబుతున్నారు.

ఎక్స్‌క్లూజివ్ సమాచారం ఇదీ..!

ఢాక్యా, రేణుక దంపతులకు ఇటు రాజకీయంగా, అటు అధికార వర్గాల్లో సంబంధాలు ఉండడంతో వారిని నమ్మి ఈ అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ముట్టజెప్పినట్లు తెలిసింది. తన తమ్ముడి ద్వారా మిగిలిన ముగ్గురిని రేణుక సంప్రదించినట్లు వారి కుటుంబీకులు చెబుతున్నారు. నీలేశ్‌ తండ్రి లోక్యానాయక్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదిస్తే తన కొడుకు ఇంజనీరింగ్‌ చదివి, మహారాష్ట్రలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడని, తమ బంధువులమ్మాయి కావడంతో రేణుకకు డబ్బులిచ్చి ఉంటారని, తన కొడుకు మోసపోయాడని కన్నీటిపర్యంతమయ్యారు. రేణుక వసూళ్ల వ్యవహారం ఈ ముగ్గురికే పరిమితం కాకపోవచ్చనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అలాగే రేణుక దంపతుల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే అంశంపైనా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రేణుక వ్యవహారం ఆమె స్వగ్రామం మన్సూర్‌పల్లి తండా, భర్త సొంతూరు పంచలింగాల తండాల్లో సంచలనంగా మారింది.

ప్రవీణ్‌తో రేణుక పరిచయం ఎలాగంటే..!

రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన తర్వాత ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దానిని సరిచేసుకోవడానికి ఆమె టీఎస్‌‌పీఎస్సీని సంప్రదించి, పలుమార్లు హైదరాబాద్‌లోకి కార్యాలయానికి వెళ్లారని ఆ క్రమంలోనే ఆమెకు ప్రవీణ్‌తో (TSPSC Praveen) పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై సాన్నిహిత్యం పెరిగి ఇంతటి అక్రమానికి దారితీసిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రవీణ్‌కు ఎక్కువ మంది మహిళలతోనే మొబైల్‌ కాంటాక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన చాటింగ్‌లు, నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.

60 మందితో..!

ప్రవీణ్‌తో రెగ్యులర్‌గా కాంటాక్టులు, చాటింగ్‌లు చేస్తున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్‌కు కాంటాక్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును విచారిస్తుస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఆ 60 మందినీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 2017 నుంచి ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ డేటాను పోలీసులు రికవరీ చేయనున్నట్లు తెలిసింది. 2017 నుంచి టీఎస్‌‌పీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి? ఆ సమయంలో ప్రవీణ్‌ ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2023-03-16T11:24:24+05:30 IST