Naatu Naatu Oscar: ‘నూతిలోని కప్ప’.. అంటూ ఏపీ సీఎం జగన్‌ను ఆడేసుకున్న బాలీవుడ్ సింగర్!

ABN , First Publish Date - 2023-03-14T16:50:22+05:30 IST

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన

Naatu Naatu Oscar: ‘నూతిలోని కప్ప’.. అంటూ ఏపీ సీఎం జగన్‌ను ఆడేసుకున్న బాలీవుడ్ సింగర్!

ముంబై: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’(RRR) సినిమాలోని ‘నాటునాటు’(Natu Natu) పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ భారతావని పులకించి పోయింది. ఇక, తెలుగు నేల ఆనందానికి అయితే హద్దుల్లేకుండా పోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందంతో ట్వీట్లు చేస్తూ మురిసిపోయారు. దేశానికి ఆస్కార్ తీసుకొచ్చారంటూ రాజమౌళి అండ్ టీంను ప్రశంసల్లో ముంచెత్తుతూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న సన్నని గీత ఇక చెరిగిపోతుందని సినీ పండితులు భావించారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) చేసిన ట్వీట్ ‘నార్త్-సౌత్’ మధ్య మరోమారు అగ్గిరాజేసింది. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ దక్కడంపై ఏపీ సీఎం స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీటే ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది.

‘తెలుగు జెండా ఎగురుతోంది. మన తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వంగా ఉంది. ఈ ఘన విజయానికి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి అర్హులు. అలాగే, పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు’ అని ఆ ట్వీట్‌లో జగన్ పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌పై బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ(Adnan Sami) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, జగన్‌ను ‘నూతిలో కప్ప’తో పోల్చారు. ప్రాంతీయ విభజనలు సృష్టిస్తున్నందుకు సిగ్గుపడాలని ట్వీట్ చేశారు. అసలు తెలుగు జెండా ఎగరడమేంటని ప్రశ్నించారు. మన జానపద వారసత్వాన్ని అందంగా జరుపుకునే ఆ తెలుగు పాటతో తానెంతో గర్వంగా ఉన్నానని పేర్కొన్నారు.

‘‘తన చిన్న ముక్కుకు మించిన సముద్రం గురించి ఆలోచించలేని చెరువులో ఉన్న ప్రాంతీయ మనస్తత్వం గల కప్ప కదా ఇది!! ప్రాంతీయ విభజనలను సృష్టించినందుకు, దేశాన్ని చూసి గర్వపడలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను! జై హింద్!!’ అని అద్నాన్ సమీ ఆ ట్వీట్‌లో విరుచుకుపడ్డారు.

తన సమస్య భాష కాదని, మాండలికంతో సంబంధం లేకుండా భాషలన్నీ ‘మొదట భారతీయుడు’ అనే గొడుగు కింద ఉన్నాయని, ఆ తర్వాతే ఏదైనా అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను బోల్డన్ని ప్రాంతీయ భాషల్లో ఒకే రకమైన భక్తిభావంతో పాటలు పాడానని గుర్తు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి..

ఆర్ఆర్ఆర్ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు. రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లను ఏకకాలంలో చూపిస్తూ సాగే కథ ఇది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన ‘నాటునాటు’ పాట ఆస్కార్‌కు ముందే బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కింద గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2023 దక్కించుకుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ రూ. 550 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకుపైగా వసూలు చేసింది.

Updated Date - 2023-03-14T17:00:15+05:30 IST