ABN Telugu: నాలుగో స్థానానికి దూసుకెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఇవే ప్రధాన కారణాలు..

ABN , First Publish Date - 2023-06-09T18:15:03+05:30 IST

వాస్తవిక సమాచారాన్ని నిరంతరాయంగా అందిస్తూ తెలుగు ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షిస్తున్న భారతీయ వార్తా ఛానళ్ల జాబితాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 4వ స్థానంలో నిలిచింది.

ABN Telugu: నాలుగో స్థానానికి దూసుకెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఇవే ప్రధాన కారణాలు..

వాస్తవిక సమాచారాన్ని నిరంతరాయంగా అందిస్తూ తెలుగు ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) డిజిటల్ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో (Youtube) ఎక్కువ మంది వీక్షిస్తున్న భారతీయ వార్తా ఛానళ్ల జాబితాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 4వ స్థానంలో నిలిచింది. యూట్యూబ్ డేటా ప్రకారం.. గతంతో పోల్చితే ఏకంగా 20 స్థానాలు మెరుగుపడి 4వ స్థానానికి ఎగబాకింది. జాతీయ మీడియా ఛానళ్ల సరసన నిలిపి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని తెలుగు ప్రజలు ఆదరిస్తున్న తీరుకు ఈ ర్యాంకింగ్ సాక్ష్యంగా నిలిచింది. దమ్మున్న ఛానల్‌గా ఏబీఎన్‌ యూట్యూబ్‌ వేదికగా దుమ్మురేపడంలో తెలుగు వీక్షకుల తోడ్పాటు మరువలేనిది.

ABN-Telugu.jpg

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖులతో చేసే ఇంటర్వ్యూలకు విశేష ఆదరణ దక్కడం డిజిటల్ మీడియాలో ఏబీఎన్ సాధించిన ఈ ఘనతకు ఎంతగానో ఉపకరించింది. సమకాలీన రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్‌గా సూటిగా, సుత్తి లేకుండా ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ పేరుతో ఆయన చేసే నిఖార్సయిన విశ్లేషణ ఏబీఎన్‌కు కొండంత అండగా నిలిచింది. అంతేకాదు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ కేవలం టీవీలకే పరిమితం కాలేదు. యూట్యూబ్‌లో వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా ప్రముఖులతో లైవ్ ఇంటర్వ్యూలతో ఏబీఎన్ నెటిజన్లకు మరింత చేరువైంది. ఏబీఎన్ డిజిటల్ వేదికగా మూడు నిమిషాల లోపే ఆసక్తికర సమాచారాన్ని వీడియోల రూపంలో అందిస్తూ సమాచారాన్ని మరింత సులభంగా, సరళంగా డిజిటల్ వీక్షకులకు అందించడం ఏబీఎన్‌ను నాలుగో స్థానంలో నిలిపేందుకు దోహదపడిందని చెప్పడంలో సందేహమే లేదు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత, వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి. ఈ ఇద్దరూ రెండు రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు ఆప్తులు. దీంతో.. కవరేజ్ విషయంలో తెలుగు మీడియాలోని కొన్ని ఛానళ్లు అంటీముట్టనట్టు వ్యవహరించినప్పటికీ వాస్తవాలను ప్రజలకు చేరవేసే విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెనకడుగు వేయలేదు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణను, అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణను, న్యాయస్థానాల్లో ఈ కేసుల తాలూకా పరిణామాలను ఎప్పటికప్పుడు మినిట్ టూ మినిట్ ప్రజలకు చేరవేయడంలో ఏబీఎన్ అదరలేదు, బెదరలేదు. ఈ తెగువే డిజిటల్ మీడియాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని వీక్షకులకు మరింత దరికి చేర్చింది. ఈ ధైర్యమే ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ దమ్మున్న ఛానల్ అని మరోసారి తెలుగు ప్రజలే నిరూపించేలా చేసింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా మీడియా ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న జర్నలిజం ప్రాథమిక సూత్రాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎన్నడూ మరువలేదు.

ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడూ ఆ ప్రభుత్వంలోని లోపాలను, లోటుపాట్లను ఏబీఎన్ ఎలా ప్రజల ముందు ఉంచిందో, నేడు జగన్ సర్కార్ అధికారంలో ఉన్నా తానాతందానా అనకుండా ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ ముందుకు సాగుతోంది. దీంతో.. జగన్ సర్కార్ ఏబీఎన్‌పై కత్తి కట్టింది. అధికారంలోకి వచ్చీరాగానే ఏబీఎన్ ప్రసారాలకు అడుగడునా అడ్డంకులు సృష్టించింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. కానీ.. సోషల్ మీడియాలో, యూట్యూబ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో నిలువరించలేక బహిరంగ సభల వేదికగా ఏబీఎన్‌పై, ఆంధ్రజ్యోతిపై జగన్ శాపనార్థాలకు పూనుకున్నారు. కానీ.. ప్రజలు ఆదరించినంత కాలం, వాస్తవాలను ప్రసారం చేసినంత కాలం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రయాణం అప్రతిహతంగా సాగుతూనే ఉంటుందని చెప్పడానికి యూట్యూబ్‌లో తాజా ర్యాంకింగే నిదర్శనం.

Updated Date - 2023-06-09T18:40:07+05:30 IST