25 యేళ్ళలో.. 13 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ABN , First Publish Date - 2023-04-04T09:12:24+05:30 IST

ఈరోడ్‌(Erode) జిల్లా బర్గూరుకు సమీపంలోని కొండజాతికి చెందిన దంపతులు తమ మత ఆచారానికి కట్టుబడి ఏకంగా 13 మంది

25 యేళ్ళలో.. 13 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

అడయార్‌(చెన్నై): ఈరోడ్‌(Erode) జిల్లా బర్గూరుకు సమీపంలోని కొండజాతికి చెందిన దంపతులు తమ మత ఆచారానికి కట్టుబడి ఏకంగా 13 మంది పిల్లలకు జన్మనిచ్చారు. అయినప్పటికీ భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌(Family planning operation) చేయించేందుకు భర్తకు మనసు రాలేదు. ఇప్పటికే 13 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆ మహిళ మరో కాన్పు చేస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో వైద్యులు, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు 3 గంటల పాటు దంపతులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ ఫలితంగా కుటుంబ యజమానికి వేసక్టమీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

25 యేళ్ళలో 13 ప్రసవాలు..

ఈరోడ్‌ జిల్లా అందియూరు సమీపంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బర్గూరు కొండ ప్రాంతమైన చిన్నకరై గ్రామానికి చెందిన చిన్నమాదన్‌ (46), శాంతి (45) అనే దంపతులు ఉన్నారు. చోళగర్‌ అనే కొండజాతి తెగకు చెందిన ఈ దంపతులకు 25 యేళ్ళ క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 12 మంది పిల్లలకు జన్మనిచ్చారు. చివరగా గతవారం 13వ సంతానంగా మరో మగబిడ్డకు శాంతి జన్మనిచ్చింది. ఈ 13 మంది పిల్లల్లో ఎనిమిది మంది మగపిల్లలు ఉండగా, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, చివరి కాన్పు సమయంలో శాంతికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో మరో కాన్పుకు వెళితే పెద్ద ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ విషయాన్ని భర్త చిన్నమాదన్‌కు వివరించినప్పటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో వైద్యులకు పాలుపోలేదు.

ప్రత్యేక వైద్య బృందం చొరవతో...

బ్లాక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శక్తికృష్ణన్‌ నేతృత్వంలోన కొందరు వైద్యులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు చిన్నమాదన్‌ ఇంటికి వెళ్ళి, కు.ని ఆపరేషన్‌ కోసం వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, తమ మత ఆచారం ప్రకారం ఆపరేషన్‌ చేయించుకునేందుకు వారు ముందుకు రాలేదు. అయితే, వైద్యులు మాత్రం పట్టువీడకుండా మూడు రోజుల పాటు ఆ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. వీరి కృషి ఫలితంగా చిన్నమాదన్‌ కు.ని ఆపరేషన్‌కు అంగీకరించడంతో ఆయనకు వేసక్టమీ చేశారు. ఆ తర్వాత 108 అంబులెన్స్‌లో ఆయనను తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చారు. దీనిపై శక్తికృష్ణన్‌ మాట్లాడుతూ.. వైద్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, మహిళా సంక్షేమ సంఘాల ప్రతినిధులంతా కలిసి ఆ దంపతులను ఒప్పించి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు. అదేసమయంలో వారితోపాటు వారి పిల్లలకు కూడా వారం రోజులకు సరిపడా ఆహారం, తినుబండరాలను అందజేశామని తెలిపారు.

Updated Date - 2023-04-04T09:12:24+05:30 IST