Share News

Gold Buying Tips:గోల్డ్ తీసుకుంటున్నారా? అయితే ఈ ఏడు విషయాలు తప్పక గుర్తించుకోవాల్సిందే..

ABN , First Publish Date - 2023-11-08T17:47:53+05:30 IST

గోల్డ్ అంటే మహిళలకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ, దీపావళిలాంటి పండుగలు సందర్భాలు వస్తే బంగారానికి చాలా డిమాండ్ పెరుగుతుంది. పండుగల సందర్భంగా గోల్డ్ కొంటే అదృష్టం వరిస్తుందని, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అవి మంచి రోజులని చాలా మంది నమ్ముతారు.

Gold Buying Tips:గోల్డ్ తీసుకుంటున్నారా? అయితే ఈ ఏడు విషయాలు తప్పక గుర్తించుకోవాల్సిందే..

ఢిల్లీ: గోల్డ్ అంటే మహిళలకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ, దీపావళిలాంటి పండుగలు సందర్భాలు వస్తే బంగారానికి చాలా డిమాండ్ పెరుగుతుంది. పండుగల సందర్భంగా గోల్డ్ కొంటే అదృష్టం వరిస్తుందని, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అవి మంచి రోజులని చాలా మంది నమ్ముతారు. అయితే బంగారం కొనుగోలు కోసం జ్యువెలరీ షాప్ కి వెళ్లే ముందు మీరు గుర్తించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడం నుండి మేకింగ్ ఛార్జీలు, హాల్‌మార్కింగ్‌లను అర్థం చేసుకునే వరకు ముఖ్యమైన అంశాలపై మీకు సూచనలు ఇవ్వడానికి ఈ కథనం ఉపయోగపడుతుంది. ఓ ప్రముఖ జ్యువెలరీ వ్యవస్థాపకుడు దిశి సోమాని తెలిపిన వివరాలు..


కొనే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు..

1. స్వచ్ఛత: బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లలో కొలుస్తారు, 24 క్యారెట్ల బంగారం అధిక ధరకు వస్తుంది. మీరు కొనుగోలు చేస్తున్న బంగారం స్వచ్ఛతను ధ్రువీకరించడం చాలా అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణేలను తీసుకోండి. ఇవి బంగారం స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. స్వచ్ఛమైన బంగారం కోసం ప్రముఖ నగల షోరూంలను ఆశ్రయించడం బెటర్.

2. బరువు, ధర: బంగారం బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. మార్కెట్ రేట్లననుసరించి కూడా ధరల్లో వ్యత్యాసాలుంటాయి. మీరు కొనుగోలు చేస్తున్న బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణెం బరువును తనిఖీ చేసి, ధరను లెక్కించడానికి ప్రస్తుత మార్కెట్ రేటుతో సరిపోల్చండి. ఆభరణాలు చేసే వారు మేకింగ్ ఛార్జీలు, తరుగు ఛార్జీలు వసూలు చేస్తారు. ఇవి డిజైన్, నైపుణ్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఛార్జీలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

3. బడ్జెట్: బంగారాన్ని కొనుగోలు చేసే ముందు మన బడ్జెట్ ఎంతో అంచనా ఉండాలి. బంగారాన్ని చూసి ఆకర్షణకు గురవుతాం. దీంతో మనం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం సులభం. మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి. అన్ని రకాలుగా చూసుకున్నాకే బంగారం కోసం మీరు ఎంత ఖర్చుపెట్టగలరో నిర్ణయించండి. బంగారాన్ని కొనుగోలు చేయడానికి అప్పులు చేయడం లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఇది ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.

4. ఉద్దేశం: బంగారం కొనుగోలు ఉద్దేశం ఏంటని ఆలోచించండి. పెట్టుబడి కోసమా లేక వ్యక్తిగత అవసరాల కోసమా? అని నిర్ధారించుకోండి. బంగారాన్ని పెట్టుబడిగా కొనుగోలు చేస్తుంటే బంగారు కడ్డీలు లేదా నాణేలను ఎంచుకోవచ్చు. ఎందుకంటే వాటిని అమ్మడం/మార్పిడి చేయడం సులభం. ఆభరణాలు మాత్రం మేకింగ్, అదనపు ఖర్చులను కలిగి ఉంటాయి. మళ్లీ అమ్మితే దానికున్న విలువ కొనుగోలు ధరకు సమానంగా ఉండకపోవచ్చు. పర్సనల్ ఉపయోగానికైతే మీరు ఇష్టపడే, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండే డిజైన్‌ను ఎంచుకోండి.

5. సర్టిఫికేషన్: బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు ధ్రువపత్రాలు లేదా ప్రామాణికత గుర్తులను చూడండి. విశ్వసనీయ ఆభరణాలు ప్రామాణికత ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తాయి. ఇది బంగారం స్వచ్ఛత, బరువును తెలియజేస్తుంది. మీరు భవిష్యత్తులో బంగారాన్ని విక్రయించాలనుకుంటే లేదా మార్పిడి చేయాలనుకుంటే సర్టిఫికేషన్ ఉపయోగకరంగా ఉంటుంది.

6. రిటర్న్/ఎక్స్ఛేంజ్ పాలసీ: ఆభరణాల వ్యాపారి వద్ద రిటర్న్/ఎక్స్ఛేంజ్ పాలసీ గురించి అడిగి తెలుసుకోండి. పలు కారణాల వల్ల మీరు బంగారాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటే లేదా మార్చుకోవాలనుకుంటే వారి పాలసీలను తెలుసుకోవడం ముఖ్యం. నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవండి. కొనుగోలుకు సంబంధించిన అన్ని రసీదులు, పత్రాలను జాగ్రత్త పరచండి.

7. నిల్వ, భద్రత: బంగారాన్ని కొనుగోలు చేసిన తరువాత సరైన చోట భద్రంగా దాచండి. బంగారం విలువైన ఆస్తి. పోతే లక్షల్లో నష్టపోతాం. మీ బంగారాన్ని భద్రపరచడానికి బ్యాంకులో సేఫ్ డిపాజిట్ బాక్స్‌లో లేదా ఇంట్లోని సురక్షిత లాకర్‌లో దాచండి. ముందు జాగ్రత్తగా బంగారానికి బీమా చేయండి.

Updated Date - 2023-11-08T17:54:11+05:30 IST