Balineni Srinivasa: బాలినేని శ్రీనివాస్‌కు వైసీపీ చెక్??.. కీలక పరిణామానికి సంకేతాలు ఇవేనా!!

ABN , First Publish Date - 2023-05-04T12:10:36+05:30 IST

రాజకీయ పార్టీ ఏదైనా అసంతృప్తులు, బుజ్జగింపులు సర్వసాధారణం. ఎంతకీ చల్లారని సందర్భాల్లో స్వయంగా పార్టీ అధినేతలే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడం పరిపాటి. కానీ బాలినేని ఎపిసోడ్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

Balineni Srinivasa: బాలినేని శ్రీనివాస్‌కు వైసీపీ చెక్??.. కీలక పరిణామానికి సంకేతాలు ఇవేనా!!

ఇటివలే ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని (Balineni Srinivasa reddy) ఆ పార్టీ నమ్మడం లేదా?. ఆయన పార్టీని వీడడం ఖాయమని అనుమానిస్తోందా?. నియోజకవర్గానికే పరిమితమవుతానంటూ స్వయంగా సీఎం జగన్‌ (CM Jagan) వద్దే వివరణ ఇచ్చుకున్నా నమ్మకం కుదరడం లేదా?. ఇప్పటికే పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి బాటలోనే బాలినేని కూడా పయనిస్తారని భావిస్తోందా?. ఈ పరిణామమే జరిగితే అధికార పార్టీకి మరో దెబ్బ ఖాయమని వైసీపీ నాయకత్వం ఆందోళన చెందుతోందా?. ఆయన పార్టీ వీడక ముందే తామే పార్టీ నుంచి గెంటి వేశామనేందుకు ప్లాన్స్ సిద్ధం చేసుకుందా?. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా ప్రయత్నాలు మొదలయ్యాయా?... అంటే ఔననే భావన కలిగించే కీలక పరిణామాలు తెరమీదకు వచ్చాయి. వైసీపీలో (YSRCP) హాట్‌టాపిక్‌గా మారిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి చుట్టూ వైసీపీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామంపై ఓ లుక్కేద్దాం...

రాజకీయ పార్టీ ఏదైనా అసంతృప్తులు సర్వసాధారణం. ఎంతకీ చల్లారని సందర్భాల్లో స్వయంగా పార్టీ అధినేతలే రంగంలోకి బుజ్జగించడం పరిపాటి. కానీ బాలినేని అసంతృప్తి ఎపిసోడ్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రెండు రోజుల క్రితమే సీఎం జగన్‌ను కలిసి పార్టీ సమన్వయ కర్త పదవి నుంచి తప్పుకోవడంపై బాలినేని వివరణ ఇచ్చుకున్నా సమస్య సద్దుమణిగినట్టు కనిపించడం లేదు. జగన్ - బాలినేని మధ్య 40 నిమిషాలపాటు చర్చ జరిగింది. ఇలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని జగన్ చెప్పినా బాలినేని దిగిరాలేదు. ఆరోగ్యం బాగాలేని కారణంగా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతానంటూ తేల్చిచెప్పారు. దీంతో ‘నీ ఇష్టం’ అంటూ జగన్ ఆయన్ను పంపించారు. అయితే ఈ కీలక భేటీ ముగిసిన తర్వాత వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో బాలినేని వ్యతిరేక ప్రచారం మొదలైంది. బాలినేనిని పొమ్మనలేక పొగబెడుతున్నారా? అని అనుమానం కలిగేలా పోస్టులు కనపడుతున్నాయి. ఈ కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

బాలినేని పేకాట తప్ప.. సేవ చేసింది లేదు..!

బాలినేనిపై రాజకీయ ఆరోపణలు చేస్తూ వైసీపీ అనుకూల ఓ యూట్యూబ్ ఛానల్ రూపొందించిన ఓ వీడియో ఆసక్తికరంగా మారింది. బాలినేనికి విషయం తక్కువ, పేకాట, ఇంకో ఆట ఎక్కువ అని వైసీపీ మార్క్ నిందలు ఆ వీడియోలో కనిపించాయి. ‘‘ ఆయన పేకాట, ఇంకో ఆట నిత్యం ఆడుతుంటారు. కానీ ప్రజల్లోకి వెళ్లమంటే ఆరోగ్యం బాగాలేదని చెబుతుంటారు’’ అని ఆరోపణలు గుప్పించారు. ‘‘ వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి భావించినప్పుడు పార్టీని ప్రక్షాళన చెయ్యాలి. పని చెయ్యలేని వాళ్లు, సేవ చెయ్యలేని వాళ్లకు విలువ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. అందులోనా కుటుంబం నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని జగన్ చూస్తున్నారు. ఏదో మనోడని రాజశేఖర్ రెడ్డి సీటు ఇస్తే గాలి వాటాన బాలినేని గెలిచారు. బాలినేని మీడియాకు లీకులిస్తూ.. పవన్ కళ్యాణ్‌తో ఫొటోలు దిగుతుంటారు.

ఒంగోలులో కమ్మలు, కాపుల్లోని నేతలను దగ్గరకు తీసుకుని పేకాట ఆడుతుంటారు. అలాంటోళ్ల మీద ఆధారపడి కాళ్లమీద కాళ్లు వేసుకుని పడుకుంటే ఓట్లు పడవు. ఇంతకుమించి బాలినేనికి క్వాలిఫికేషన్ ఏమీ లేదు. ప్రజలకు సేవ చేసిన దాఖలాలు లేవు. సొంత కుటుంబ సభ్యుడికి న్యాయం చేయలేని వాడు. ఒంగోలులో ఎవరిని అడిగినా ఆయన మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయంటున్నారు. సంవత్సరం నుంచి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడం ఆయన వల్ల కాదు. కొత్త రాజకీయాలకు నువ్వు పనికిరావు. రాజీనామా చేయాలనుకుంటే జగన్‌కు చెప్పి చేయాలి. మీడియాకు లీకులు ఇవ్వడం ఏంది?’’ అని ఆ వీడియోలో బాలినేనిపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ఏపీ పాలిటిక్స్‌లో ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ఎలాంటి చర్చ, ఎవరి ఆదేశాలు లేకుండానే ఇలాంటి ప్రచారాలు చేస్తారా అంటూ ఒంగోలు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.

కాగా సీఎం జగన్ పర్యటనలో ప్రొటోకాల్ ఎపిసోడ్, తన జిల్లాకే చెందినవారిని మంత్రి పదవుల్లో కొనసాగిస్తూ తనని మాత్రం పక్కనపెట్టడం, కనీసం కోరిన డీఎస్పీని కూడా కేటాయించకపోవడం బాలినేని అసంతృప్తికి కారణాలని ప్రచారం జరిగింది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడానికి ఈ పరిణామాలే దారితీశాయని చర్చ నడిచింది. ఈ క్రమంలోనే పార్టీకి కూడా రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆఖరికి సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగినా ఈ తరహా ప్రచారం జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ బుజ్జగించిన తర్వాత ఈ పరిణామం దేనికి సంకేతం?. నిజంగానే ఆయన వైసీపీని వీడతారా? అనే చర్చ మొదలైంది. మరి బాలినేని కేంద్రంగా వైసీపీలో జరుగుతున్న ఈ కీలక పరిణామం ఎటువైపు దారితీస్తుంది, ఈ ప్రచారం ఏవిధంగా ముగుస్తుందో వేచిచూడాలి.

Updated Date - 2023-05-04T12:49:19+05:30 IST