BJP Vs Congress : కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. రేవంత్ రెడ్డికి టచ్‌లో బీజేపీ ఎంపీ..!

ABN , First Publish Date - 2023-05-15T22:36:41+05:30 IST

దక్షిణాదిన పాగా వేయాలని భావించిన బీజేపీ కన్నడనాట బొక్కబోర్లాపడింది. కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఎవరూ ఊహించని రీతిలో 136 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం (Congress Grand Victory) సాధించింది. అదిగో గెలిచేస్తున్నాం..

BJP Vs Congress : కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. రేవంత్ రెడ్డికి టచ్‌లో బీజేపీ ఎంపీ..!

దక్షిణాదిన పాగా వేయాలని భావించిన బీజేపీ కన్నడనాట బొక్కబోర్లాపడింది. కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఎవరూ ఊహించని రీతిలో 136 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం (Congress Grand Victory) సాధించింది. అదిగో గెలిచేస్తున్నాం.. ఇదిగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తున్నాం.. దక్షిణాదిన జెండా పాతుతామన్న బీజేపీ మాత్రం ఇందులో సగం సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఈ ఒక్క ఫలితంతో దక్షిణాదిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయ్. ఇప్పటికే కన్నడనాట పెనుమార్పులు చేయాలని బీజేపీ భావిస్తుండగా.. తెలుగు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న నేతలు, సిట్టింగ్‌లు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. అంతేకాదు పార్టీ మారడానికి కూడా సిద్ధమైపోయారట. ఇవన్నీ ఒక ఎత్తయితే బీజేపీ సిట్టింగ్ ఎంపీ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (TPCC Chief Revanth Reddy) టచ్‌లోకి వెళ్లారన్న వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు..? ఎందుకు బీజేపీని కాదనుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

revanth.jpg

ఆ ఎంపీ ఎవరంటే..!

తెలంగాణలో ఇప్పుడు బీజేపీనే రెండో స్థానంలో ఉందని.. అధికార పార్టీకి తామే సరైన ప్రతిపక్షమని కమలనాథులు తెగ చెప్పుకుంటూ ఉంటారు. అయితే రియాల్టీలోకి వస్తే పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. రెండ్రోజులకోసారి రచ్చకెక్కడం, గ్రూపు రాజకీయాలు, వర్గవిబేధాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మరీ ముఖ్యంగా.. రాష్ట్రంలో బాగా దూకుడు మీదున్న బీజేపీలో ఇప్పుడు చేరికల చిచ్చు రగులుతోంది. బద్ధశత్రువులుగా భావించేవారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారు..? అది కూడా తమను ఒక్క మాట కూడా సంప్రదించకుండా ఎలా కండువా కప్పుతారు..? అని సిట్టింగ్‌లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జాతీయ నేతలు రంగంలోకి దిగినప్పటికీ దీనికి మాత్రం పరిష్కార మార్గం దొరకట్లేదు. ఇలా ఈ మధ్యే కాంగ్రెస్ కీలక నేత, ఏఐసీసీ కార్యక్రమాల అలమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) హస్తం పార్టీని వీడి.. కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు (MP Soyam Bapu Rao).. ఏలేటికి 2018 నుంచి అస్సలు పడదు. ఒకప్పుడు తాను ఓడిపోవడానికి కారణమైన ఏలేటిని ఎలా తీసుకుంటారు..? కనీసం తనను సంప్రదించకుండానే తీసుకున్నారు..? అని ఎంపీ అలకబూనారు. నాటి నుంచి బీజేపీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టు ఉంటున్నారు.

soyam.jpg

ఎంపీ ఏం చేయబోతున్నారు..!?

ఏలేటిని చేర్చుకోవడంపై అధిష్టానం తీరుతో నొచ్చుకున్న ఎంపీ సోయం కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆయన బీజేపీలో చేరినప్పట్నుంచీ ఎంపీ సైలెంట్ అయిపోయారు. మహేశ్వర్ రెడ్డి చేరిక సమయంలో గానీ.. చేరిన తర్వాత గానీ.. కనీసం సంప్రదించలేదు.. సోయం కనిపించలేదు కూడా. ఈ పరిణామాలన్నింటినీ కాస్త నిశితంగా పరిశీలిస్తే బాపురావు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని ముమ్మర ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇంతలా వార్తలు వస్తున్నా.. ఆయన్ను సంప్రదించడానికి మీడియా ప్రయత్నించినప్పటికీ ఎంపీ ఎక్కడా ఖండిచకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ఆయన కర్ణాటక ఫలితాలతో ఇదే సరైన సమయం అని పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంత జరుగుతున్నప్పటికీ కనీసం పార్టీ నుంచి కూడా కనీసం రియాక్షన్ రాకపోవడం గమనార్హం. అంటే పార్టీ మారాలని ఫిక్స్ అయిన సోయంను ఇక ఏం బుజ్జగించినా ప్రయోజనం ఉండదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారో ఏంటో మరి.

Revanth-And-Soyam.jpg

ఏలేటి-సోయంకు ఇక్కడే చెడింది..!?

కమ్యూనిస్ట్ పార్టీ నేతగా, ఆదివాసీలు సంఘాల్లో కీలక పాత్ర పోషించిన సోయం బాపురావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో (2018 Assembly Elections) బోథ్ (Boath Assembly constituency) నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేశారు. అప్పటి వరకూ ఈయన గెలుపు అంతా పక్కా అనుకున్నారు. అంతేకాదు బీఆర్ఎస్‌కు (BRS) కూడా గట్టిపోటీ కూడా ఇస్తారని భావించారు. సీన్ కట్ చేస్తే స్వల్ప ఓట్ల మెజార్టీతో సోయం పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కని అనిల్ జాదవ్ అనే వ్యక్తి బరిలోకి దిగారు. అనిల్‌కు 28,206 ఓట్లు వచ్చాయి. అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావుకు.. సోయం గట్టిపోటీనే ఇచ్చారు కానీ.. అనిల్ పోటీతో ఓట్లు చీలిపోయాయి. కేవలం 6,486 మెజార్టీతోనే బీఆర్ఎస్ గెలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి మాధవి రాజుకు 4,840 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ మొత్తమ్మీద.. అనిల్‌ను పోటీలోకి దింపినది ఏలేటి మహేశ్వర్ రెడ్డేనని బాపురావు అప్పట్నుంచీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక్కడే ఇద్దరికీ చెడింది. నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు మారిపోయాయి. నాడు మొదలైన ఈ రచ్చ .. ఆఖరికి ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయడం వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం వరకూ వెళ్లింది. అసెంబ్లీ నుంచి ఆదరించకపోయినా.. ఎంపీగా అయినా ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో ఆదిలాబాద్ ఎంపీగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన గోదెం నగేష్ పై.. 58,560 ఓట్ల మెజార్టీతో సోయం గెలుపొందారు. దీంతో నాటి నుంచి బీజేపీలో తిరుగులేని నేతగా ఉన్న సోయంకు ఎప్పుడైతే ఏలేటిని పార్టీలో చేర్చుకున్నారో అప్పట్నుంచీ అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Untitled-12.jpg

రేవంత్‌ను ఎప్పుడు కలవబోతున్నారు..?

ఇప్పటి వరకూ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలే వచ్చాయంతే.. అయితే తాజాగా రేవంత్‌రెడ్డిని (TPCC Chief Revanth Reddy) తన ఇంటికే ఆహ్వానించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల21న ఆదిలాబాద్‌లో సోయం కుమారుడి పెళ్ళి (Soyam Son Marriage) జరగనుంది. ఈ వేడుకకు తప్పకుండా రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన ఏ ఒక్కరికీ ఇంతవరకూ ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. అయితే పెళ్లికి సమయం ఉన్నందున ఈలోపు బీజేపీ (BJP) ఆహ్వానిస్తారని టాక్ నడుస్తున్నప్పటికీ.. ఎంపీ ముఖ్య అనుచరులు, అభిమానులు మాత్రం ఒప్పుకోవట్లేదట. రేవంత్‌రెడ్డితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ స్నేహం వల్లనే పిలిచినట్టు ఎంపీ వర్గీయులు చెబుతున్నారు.. కానీ బాపురావు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకే డిసైడ్ అయ్యాక ఇలా ఆహ్వానం పంపారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ వేడుకలోనే చేరిక గురించి చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

Revanth-reddy.gif

మొత్తానికి చూస్తే.. అటు బీజేపీ కార్యక్రమాల్లో సోయం పాల్గొనకపోవడం, ఇటు రేవంత్‌ను ఆహ్వానించినట్లు వస్తున్న వార్తలు.. బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడం ఈ పరిణామాలన్నింటినీ కాస్త లోతుగా పరిశీలిస్తే పరిస్థితేంటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో శుభకార్యం పూర్తయ్యాక భవిష్యత్ కార్యాచరణపై ఎంపీ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై అభిమానులు, అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫైనల్‌గా బీజేపీ పెద్దలు బుజ్జగించి ఏలేటి-సోయంను కలుపుతారా లేకుంటే.. ఎవరిదారి వాళ్లదేలే అని మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈయన పార్టీ మారితే మాత్రం బీజేపీ భారీ ఎదురుదెబ్బే.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వదులుకుంటుందా.. కాంగ్రెస్‌లోకి వెళ్లితే సోయం పరిస్థితేంటన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..

******************************

Chikoti ED Enquiry : ఈడీ విచారణ తర్వాత ఏబీఎన్‌తో మాట్లాడుతూ చికోటి ప్రవీణ్ కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ..!

******************************

Balineni Row : మరోసారి అసంతృప్తి వెళ్లగక్కిన బాలినేని.. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇస్తూనే వైఎస్ జగన్ గురించి ఇలా..!

*****************************



Updated Date - 2023-05-16T00:01:53+05:30 IST