YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డిపై ఉన్న అభియోగాలేంటి.. సీబీఐ అనుమానాలేంటి..!?

ABN , First Publish Date - 2023-04-16T11:16:53+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ దూకుడు పెంచింది.

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డిపై ఉన్న అభియోగాలేంటి.. సీబీఐ అనుమానాలేంటి..!?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఈ వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లేనని తెలుస్తోంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ అరెస్ట్ చేసింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి పులివెందులలో టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఆఖరికి ఆయన్ను అరెస్ట్ చేసి పులివెందుల నుంచి హైదరాబాద్‌కు అధికారులు తరలిస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోపు మెజిస్ట్రేట్ ముందు భాస్కర్‌రెడ్డిని హాజరుపరుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు అరెస్ట్ అయిన భాస్కర్‌రెడ్డిపై ఉన్న అభియోగాలేంటి..? ఈయనపై సీబీఐకి ఉన్న అనుమానాలేంటి..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

Bhaskar-reddy.jpg

భాస్కర్‌రెడ్డిపై అభియోగాలివీ..

వివేకా హత్యకేసులో కుట్రదారుడిగా వైఎస్ భాస్కర్‌రెడ్డిపై అభియోగాలున్నాయి. వివేకా గుండెపోటుతో మరణించినట్లు మొదట ప్రచారం జరిగింది. గుండెపోటుగా ప్రచారంలో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐకు అనుమానాలున్నాయి. అంతేకాదు.. సాక్ష్యాలు చెరిపేయడంలో భాస్కర్‌ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగం మోపింది. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించినట్లు సీబీఐ చెబుతోంది. కదిరి వెళ్లి దస్తగిరి గొడ్డలి తెచ్చేవరకు భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే సునీల్‌ ఉన్నాడు. 2019 మార్చి 14న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఉన్నాడు. ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఉన్న సమయంలో భాస్కర్‌రెడ్డి తన 2 ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. 14న సాయంత్రం 6:14 నుంచి 6:31 గంటల వరకు భాస్కర్‌రెడ్డి ఇంట్లో సునీల్‌ ఉన్నాడు’ అని సీబీఐ చెబుతోంది.

CBI.jpg

సీబీఐ అనుమానాలు ఇవీ..

‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. వివేకా ఓటమిలో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిది కీలకపాత్ర పోషించారు. ఓటమి తర్వాత భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిపై వివేకా మండిపడ్డారు. వివేకా వల్ల రాజకీయంగా ఎదుగుదల ఉండదని ఇద్దరు భావించారు. రాజకీయంగా అడ్డుతొలగించుకునేందుకే హత్య చేశారు’ అని సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

YS-Viveka.jpg

ఏం జరుగుతుందో..!

కాగా.. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ గుర్తించిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. విచారణకు కూడా ఒకట్రెండు సార్లు డుమ్మా కొట్టారు. ఆ తర్వాత జరిగిన విచారణలో ఈ కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ తేల్చింది. అప్పట్నుంచే ఏ క్షణం అయినా ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు సడన్‌గా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పరిణామం అయ్యింది. ఈ ఘటనతో వైసీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇది ఒక రకంగా వైసీపీకి చేదు అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సొంత ఇంటి వారినే సీబీఐ అదుపులోకి తీసుకోవడం జగన్‌ను ఇరకాటంలో పడేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్ని రోజులు తమ ఇంటి వారు కాదని వారించిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారా..? అని ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో వైఎస్‌ వివేకా లేఖ చూస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని.. కేసును పక్కదారి పట్టించొద్దని భాస్కర్ రెడ్డి చెప్పారు. అంతేకాదు తనను అరెస్ట్‌ చేస్తే చేసుకోవచ్చని తాను దేనికైనా సిద్ధమేనని కూడా భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-04-16T11:18:30+05:30 IST